Nifty: 15 వేల దిగువకు నిఫ్టీ

21 May, 2021 04:45 IST|Sakshi

రెండోరోజూ నష్టాలే

సెన్సెక్స్‌  338 పాయింట్లు డౌన్‌

ప్రపంచ మార్కెట్ల     ప్రతికూలతలు

మెటల్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు

ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ రెండో రోజూ నష్టపోయింది. డెరివేటివ్‌ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ అంశం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫైనాన్షియల్‌ అసెట్స్‌ విలువలు అనూహ్యంగా పెరిగిపోవడం భారత్‌ వంటి ఈక్విటీ మార్కెట్లకు ప్రమాదమని యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) హెచ్చరించింది. ఫలితంగా గురువారం సెన్సెక్స్‌ 338 పాయింట్లు పతనమైన 49,565 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 15వేల దిగువన 14,906 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి.

మెటల్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. కమోడిటీ ధరలను అదుపులో పెట్టేందుకు చర్యలను తీసుకుంటామని చైనా ప్రకటనతో మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఆర్థిక, ప్రైవేట్‌ రంగ షేర్లలోనూ చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 406 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయి.

నష్టాల మార్కెట్లోనూ స్మాల్‌ క్యాప్‌ షేర్లు రాణించాయి. ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడ్‌ అవుతున్న చిన్న షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఓ దశలో 23,093 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరకు 22,980 వద్ద ముగిసింది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.876 కోట్ల షేర్లు అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.71 కోట్ల ఈక్విటీలను కొన్నారు.

‘‘ప్రపంచ ప్రతికూలతలు సూచీలను నష్టాల బాటపట్టించాయి. నిఫ్టీ సూచీ 15 వేల స్థాయిని కోల్పోయినప్పటికీ.. 14,900 స్థాయిని నిలుపుకోవడం కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా భావించాలి. ఇన్వెస్టర్లు దిద్దుబాటుకు ఆస్కారం లేని నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవాలి’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ బినోద్‌ మోదీ తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
► మార్చి క్వార్టర్లో నికర లాభం ఆరు రెట్లు పెరగడంతో భాష్‌ షేరు ఏడుశాతానికి పైగా లాభపడి రూ.15846 వద్ద ముగిసింది.  

► కరోనా వ్యాధిని నిర్ధారించే ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో సిప్లా షేరు 2% లాభంతో రూ.924 వద్ద స్థిరపడింది.  

► మెరుగైన క్యూ4 ఫలితాలతో శక్తి పంప్స్‌ షేరు 15 శాతం లాభపడి రూ.712 వద్ద నిలిచింది.  

► టాటా స్టీల్, హిందాల్కో, సెయిల్, జేఎస్‌పీఎల్‌ షేర్లు 4–6% క్షీణించడంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ శాతం 3% నష్టపోయింది.

మరిన్ని వార్తలు