అయిదోరోజూ ఆగని నష్టాలు

19 Mar, 2021 04:47 IST|Sakshi

కలవరపెట్టిన కరోనా కేసులు

భరోసానివ్వని ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ

మళ్లీ బాండ్‌ ఈల్డ్స్‌ భయాలు 

సెన్సెక్స్‌ 585 పాయింట్లు డౌన్‌

నిఫ్టీ నష్టం 163 పాయింట్లు

ముంబై: దేశవ్యాప్తంగా మలిదశ కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటం స్టాక్‌ మార్కెట్‌ను కలవరపరిచింది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కోవిడ్‌ కేసుల నియంత్రణకు స్థానిక ప్రభుత్వాలు విధిస్తున్న లాక్‌డౌన్‌ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. మరోవైపు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయం ఈక్విటీ మార్కెట్లకు ఎలాంటి భరోసానివ్వలేకపోయింది. పైపెచ్చు ద్రవ్యపాలసీ ప్రకటన తర్వాత కూడా అక్కడి ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ 1.72 శాతం పెరగడం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.

ఈ ప్రతికూలాంశాలతో దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు అయిదో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 585 పాయింట్ల నష్టంతో 49,216 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 163 పాయింట్లను కోల్పోయి 14,558 వద్ద నిలిచింది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ షేర్లకు మాత్రమే స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. తక్కిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ఐటీ, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌ రంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.  విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,258 కోట్ల విలువైన షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1117 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డాలర్‌ మారకంలో రూపాయి రెండు పైసలు స్వల్పంగా బలపడి 72.53 వద్ద స్థిరపడింది.

5 రోజుల్లో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి...
స్టాక్‌ మార్కెట్‌ వరుస పతనంతో భారీ సంపద హరించుకుపోయింది. సూచీల అయిదు రోజుల పతనంలో భాగంగా ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లను కోల్పోయారు. గురువారం ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్లు సంపద ఆవిరిరైంది. ఫలితంగా బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్‌ కంపెనీల  విలువ రూ.201 లక్షల కోట్లకు దిగివచ్చింది.

మార్కెట్లో మరిన్ని విశేషాలు...
► ఎన్‌పీసీఐఎల్‌ ప్రాజెక్ట్‌కు చెందిన 10,800 కోట్ల విలువైన టెండర్‌ను దక్కించుకోవడంతో భెల్‌  షేరు 5 శాతం లాభంతో రూ.52 వద్ద ముగిసింది.
► ఐటీసీ వరుసగా నాలుగో రోజూ లాభపడింది. 4% లాభంతో రూ.219 వద్ద స్థిరపడింది.  
► సుప్రీం కోర్టు రాజస్థాన్‌ డిస్కమ్‌ రివ్యూ పిటీషన్‌ను కొట్టివేయడంతో ఆదానీ పవర్‌ షేరు ఏడాది గరిష్టాన్ని తాకి రూ.89 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు