లాభాల్లోంచి భారీ నష్టాల్లోకి..

13 Mar, 2021 05:09 IST|Sakshi

మూడురోజుల లాభాలకు బ్రేక్‌ 

సెన్సెక్స్‌ 487 పాయింట్లు డౌన్‌..

నిఫ్టీ నష్టం 144 పాయింట్లు  

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వారాంతపు రోజైన శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. భారీ లాభాలతో మొదలైనప్పటికీ.., మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలు మార్కెట్‌ను ముంచేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడంతో పాటు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఇంట్రాడేలో 1284 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్‌ చివరికి 487 పాయింట్లు పతనమై 50,792 వద్ద ముగిసింది.  382 పాయింట్ల రేంజ్‌లో ట్రేడైన నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 15,031 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక రంగాల షేర్లలో అత్యధికంగా నష్టాలను చవిచూశాయి. మార్కెట్‌ పతనంతో సూచీల మూడురోజుల ర్యాలీకి విరామం పడింది. ఇన్వెస్టర్లు రూ.1.37 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.943 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.164 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీశారు. ఈ వారంలో నాలుగురోజుల ట్రేడింగ్‌ జరగ్గా.., సెన్సెక్స్‌ 387 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లను ఆర్జించాయి.
 
‘‘ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పొజిషన్లను తగ్గించుకోవడంతో పాటు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. బాండ్‌ ఈల్డ్స్‌ తిరిగి పుంజుకోవడంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధరల పెరుగుదలతో ఆయిల్, గ్యాస్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సాంకేతికంగా నిఫ్టీ 15300 స్థాయిని నిలుపుకోవడంలో విఫలం కావడంతో అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మన మార్కెట్లో స్వల్పకాలం పాటు అస్థిరత కొనసాగే అవకాశం ఉంది.’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ విభాగపు అధిపతి బినోద్‌ మోదీ తెలిపారు.

1284 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ ట్రేడింగ్‌..!
అమెరికాలో 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి బైడెన్‌ ఆమోదం తెలపడంతో పాటు అక్కడి నిరుద్యోగిత తగ్గిందని గణాంకాలు వెలువడటంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ అంశం కలిసిరావడంతో ఒకరోజు సెలవు తర్వాత మన మార్కెట్‌ భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 382 పాయింట్ల లాభంతో 51,661 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల పెరిగి 15,321 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్, మెటల్‌ షేర్లు రాణించాయి. ఉదయం సెషన్‌లో సెన్సెక్స్‌ 541 పాయింట్లు పెరిగి 51,821 వద్ద, ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది.

మరిన్ని వార్తలు