ఇంట్రాడే నష్టాలు రికవరీ

3 Jun, 2021 03:02 IST|Sakshi

ఆదుకున్న మిడ్‌సెషన్‌ కొనుగోళ్లు 

రెండోరోజూ ఫ్లాట్‌ ముగింపే 

సెన్సెక్స్‌ నష్టం 85 పాయింట్లు 

నిఫ్టీకి ఒక పాయింటు లాభం

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు 

మెటల్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌ షేర్లలో కొనుగోళ్లు

ముంబై: మిడ్‌సెషన్‌ నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రెండోరోజూ ఫ్లాట్‌గానే ముగిశాయి. ఇంట్రాడేలో 484 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ చివరకు 85 పాయింట్ల నష్టంతో 51,849 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 115 పాయింట్ల కనిష్టం నుంచి కోలుకుని చివరకు ఒక పాయింటు స్వల్ప లాభంతో 15,576 వద్ద నిలిచింది. తొలి భాగంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, రెండో సెషన్‌లో  దిగువ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.

రూపాయి మూడోరోజూ పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఫార్మా, షేర్లు రాణించి సూచీలకు రికవరికి సహకారం అందించాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రధాన సూచీలు తడబాటుకు లోనైప్పటికీ.., మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరగడం విశేషం. నిఫ్టీ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు ఒక టిన్నర % లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 921 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.242 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు.

మిడ్‌సెషన్‌ నుంచి రికవరీ...
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 176 పాయింట్లను కోల్పోయి 51,749 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పతనమైన 15,520 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలిసెషన్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యతనివ్వడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 484 పాయింట్లు పతనమై 51,451 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు నష్టమై 15,460 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మిడ్‌సెషన్‌లో యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం సూచీలకు ఊరటనిచ్చింది. అలాగే దిగువ స్థాయిలో సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు రాణించడంతో సూచీలు మార్కెట్‌ ముగిసే సరికి దాదాపు నష్టాలన్నీ పూడ్చుకోగలిగాయి.  

‘‘ఆర్‌బీఐ పాలసీ సమావేశాల నేపథ్యంలో రెండోరోజూ స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగాయి. ప్రైవేటీకరణ జాబితాను కేంద్రం త్వరలో ఖరారు చేస్తుందనే ఆశలతో ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) షేర్లు రాణించాయి. నిఫ్టీ ఇండెక్స్‌ మరికొంత కాలం 15,500 స్థాయిని నిలుపుకొంటే, అప్‌సైడ్‌లో ఆల్‌టైం హై (15,661) స్థాయిని మరోసారి పరీక్షించవచ్చు. ఇక దిగువస్థాయిలో 15,431 వద్ద, 15300 వద్ద బలమైన మద్దతు స్థాయిలను కలిగి ఉంది’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ క్యూ4 ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత ఇన్వెస్టర్లు ఈ షేరును అమ్మేందుకు మొగ్గుచూపారు. దీంతో ఐటీసీ షేరు మూడు శాతం నష్టపోయి రూ.209 వద్ద స్థిరపడింది.
► ఇన్‌సైడర్‌ కేసులో సెబీ తాజా ఆదేశాల ఫలితంగా ఇన్ఫోసిస్‌ అంతర్గత దర్యాప్తును చేపట్ట డంతో కంపెనీ షేరు విక్రయాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో అరశాతం నష్టంతో రూ.1,380 వద్ద ముగిసింది.  
► ఆటో కాంపొనెంట్స్‌ కంపెనీ మదర్‌సన్‌ సుమీ షేరు 13 ర్యాలీ చేసి రూ.269 వద్ద ముగిసింది. క్యూ4లో కంపెనీ 8 రెట్ల నికరలాభాన్ని ప్రకటించడం ఇందుకు కారణమని ట్రేడర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు