Stock Market: రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!

29 Sep, 2021 16:19 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ రెండోరోజూ నష్టంతో ముగిసింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల భయాలు ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రూపాయి విలువ నాలుగోరోజూ క్షీణించింది. ప్రైవేట్‌ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 254 పాయింట్లు పతనమై 59,413 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 17,711 వద్ద ముగిసింది. అధిక వెయిటేజీ షేర్లైన రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు రెండు శాతం మేర క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో పాటు క్రూడాయిల్‌ ధరల పెరుగుదలతో తొలి సెషన్‌లో సెన్సెక్స్‌ 556 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు రాణించడంతో సూచీల నష్టాలు పరిమితమయ్యాయి. విద్యుత్‌ రంగాల షేర్లు వెలుగులోకి రావడంతో ప్రభుత్వ రంగ ఇండెక్స్‌ రెండోరోజూ పెరిగింది. మార్కెట్‌ పతనంలోనూ చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్లు మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్, స్మాల్‌ఇండెక్స్‌ ఇండెక్స్‌లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,896 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3262 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి ఎనిమిది పైసలు పతనమై 74.14 వద్ద స్థిరపడింది. (చదవండి: 'టెస్లా చెత్త కారు'..రివ్యూపై చర్యలకు సిద్ధమైన ఎలాన్‌ మస్క్‌)

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు రూ.74.13 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ షేర్లు నిఫ్టీలో అధికంగా నష్టపోతే.. కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, టైటన్‌, టాటా స్టీల్‌, డాక్టర్ రెడ్డీస్‌ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.

మిడ్‌సెషన్‌ నుంచి రికవరీ...  
అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ మార్కెట్‌ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ ఉదయం 371 పాయింట్ల పతనంతో 59,297 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు క్షీణించి 17,658 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్‌లో అమ్మకాల ఉధృతి తో సెన్సెక్స్‌ 556 పాయింట్లు నష్టపోయి 59,111 వద్ద, నిఫ్టీ 141 పాయింట్లు పతనమై 17,608 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. అయితే మిడ్‌సెషన్‌లో ఆసియా, ఐరోపా మార్కెట్ల రికవరీతో మన మార్కెట్‌కు ఊరటనిచ్చింది. ద్వితియార్థంలో ఇంధన, మెటల్, ఫార్మా, అయిల్‌అండ్‌గ్యాస్‌ షేర్లు రాణించాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్స్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు నష్టాలు పరిమితమయ్యాయి. ‘‘సప్లై వైపు నుంచి అంతరాయాలు, కమోడిటీ ధరల పెరుగుదలతో మార్కెట్‌ను ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. సెప్టెంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు నేడూ(గురువారం) కొనసాగవచ్చు’’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఎస్‌ రంగనాథన్‌ తెలిపారు. 

మార్కెట్లో మరిన్ని సంగతులు
ఎన్‌టీపీసీ షేరు ర్యాలీ మూడోరోజూ కొనసాగింది. బీఎస్‌ఈలో ఆరుశాతం లాభపడి రూ.141 వద్ద ముగిసింది.  
కోల్‌ ధరలు పెరగడం కోల్‌ ఇండియా కంపెనీ షేరుకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో రూ.196 వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.186 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు