ఆర్‌బీఐ అండతో 60 వేల పైకి..

9 Oct, 2021 04:58 IST|Sakshi

 ర్యాలీకి రిలయన్స్‌ దన్ను

ముంబై: ఆర్థిక వృద్ధికి కట్టుబడుతూ ఆర్‌బీఐ కమిటీ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు స్టాక్‌ మార్కెట్‌ను మెప్పించాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్‌ 381 పాయింట్లు పెరిగి 60 వేల స్థాయిపైన 60,059 వద్ద ముగిసింది. నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 17,895 వద్ద నిలిచింది. తాజా ముగింపు నిఫ్టీ సూచీకి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. అధిక వెయిటేజీ రిలయన్స్‌ షేరు నాలుగు శాతానికి పైగా రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది.

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు టెక్నాలజీ షేర్లు దుమ్ములేపాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో షేర్ల కౌంటర్లూ కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే  ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.64 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు 168 కోట్ల షేర్లను అమ్మారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్‌ 1293 పాయింట్లు, నిఫ్టీ 363 పాయింట్లు పెరిగాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడికి ముందు(శుక్రవారం) అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడ్‌ అవుతున్నాయి.

రెండు రోజుల్లో రూ.4.16 లక్షల కోట్లు...  
స్టాక్‌ మార్కెట్లో గడిచిన రెండో రోజుల్లో రూ.4.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.266.36 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 869 పాయింట్లు, నిఫ్టీ 249 పాయింట్లు     పెరిగింది.   

రిలయన్స్‌ నాలుగు శాతం జంప్‌...  
అమెరికాకు చెందిన 7–లెవెన్‌ కనీ్వనియెన్స్‌ తొలి స్టోర్‌ను అక్టోబర్‌ 9న ముంబైలో ప్రారంభించనున్నట్లు అనుబంధ సంస్థ ఆర్‌ఆర్‌వీఎల్‌ ప్రకటనతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నాలుగు శాతం లాభపడి రూ.2,671 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు