7వ రోజూ భలే దూకుడు

19 Oct, 2021 05:25 IST|Sakshi

మార్కెట్లో మళ్లీ సరికొత్త రికార్డులు

ఇంట్రాడేలో 61,963కు సెన్సెక్స్‌

ఒక దశలో 18,540 దాటిన నిఫ్టీ

సెన్సెక్స్‌ 460 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీ 139 పాయింట్లు జూమ్‌

చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగింపు

ముంబై:  దేశీ స్టాక్‌ మార్కెట్లలో అలుపెరుగకుండా రంకెలేస్తున్న బుల్‌ మరోసారి విజృంభించింది.   సూచీలు వరుసగా 7వ రోజూ హైజంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ 460 పాయింట్లు ఎగసి 61,766 వద్ద నిలవగా.. నిఫ్టీ 139 పాయింట్లు ఎగసి 18,477 వద్ద ముగిసింది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 61,963కు చేరగా.. నిఫ్టీ 18,543 పాయింట్లను అధిగమించింది.

వెరసి అటు ముగింపు, ఇటు ఇంట్రాడేలోనూ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి! విదేశీ మార్కెట్లలో కనిపిస్తున్న నిరుత్సాహకర ట్రెండ్‌ను సైతం లెక్కచేయకుండా సరికొత్త గరిష్టాలను చేరాయి. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్‌ రంగాలు 4 శాతం జంప్‌చేయగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ నేపథ్యంలో ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా ఇండెక్సులు 0.7% బలహీనపడ్డాయి.  

ఇన్ఫోసిస్‌ జోరు
నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఇన్ఫోసిస్‌ 5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్‌జీసీ, మారుతీ, యాక్సిస్, ఎస్‌బీఐ 3.3–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్, డాక్టర్‌ రెడ్డీస్, ఏషియన్‌ పెయింట్స్, బ్రిటానియా, బజాజ్‌ ఆటో, హీరో మోటో, సిప్లా, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ ఫార్మా 2–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. ఈ ఏడాది క్యూ3(జులై–సెప్టెంబర్‌)లో చైనా జీడీపీ గణాంకాలు నిరాశపరచినప్పటికీ ఎంపిక చేసిన రంగాలలోని బ్లూచిప్‌ కౌంటర్లలో పెట్టుబడులు సెంటిమెంటుకు బలాన్నిచి్చనట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. క్యూ3లో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతమే పుంజుకుంది. ఇందుకు పారిశ్రామికోత్పత్తి అంచనాలను అందుకోకపోవడం ప్రభావం చూపింది.  బేస్‌ మెటల్‌ ధరలు బలపడటంతో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగినట్లు తెలియజేశారు.    

చిన్న షేర్లు ఓకే...
బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1 శాతం స్మాల్‌ క్యాప్‌ 0.7 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,758 లాభపడగా.. 1,696 నీరసించాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 512 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.

ఇతర విశేషాలు..
► పారస్‌ డిఫెన్స్‌ షేరు టీ గ్రూప్‌ నుంచి రోలింగ్‌ విభాగంలోకి బదిలీ కావడంతో 20% అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 125 జమ చేసుకుని రూ. 750 వద్ద ముగిసింది.
► ఈ ఏడాది క్యూ2లో రెట్టింపు నికర లాభం ప్రకటించిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌(డీమార్ట్‌) షేరు తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 5,900ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివర్లో లాభాల స్వీకరణ ఊపందుకుని చతికిలపడింది. 7.6% పతనమై రూ. 4,920 వద్ద స్థిరపడింది.  
► కార్లయిల్‌ గ్రూప్‌నకు ప్రిఫరెన్స్‌ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చుకునే ప్రతిపాదనను విరమించుకోవడంతో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌  షేరు 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌కు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 32 కోల్పోయి రూ. 607 వద్ద నిలిచింది.
► ఏడు వరుస సెషన్లలో మార్కెట్లు బలపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 12.49 లక్షల కోట్లమేర ఎగసింది. దీంతో బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 2,74,69,607 కోట్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం!
► గత ఏడు రోజుల్లో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 2,576 పాయింట్లు(4.4 శాతం) దూసుకెళ్లింది.

మరిన్ని వార్తలు