మార్కెట్‌కు మూడోరోజూ లాభాలే..

9 Apr, 2021 05:29 IST|Sakshi

పాజిటివ్‌ అవుట్‌లుక్‌తో మెటల్‌ షేర్లకు డిమాండ్‌

ఐటీ షేర్లకు కలిసొచ్చిన రూపాయి పతనం 

ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమైన సూచీలు

సెన్సెక్స్‌ లాభం 84 పాయింట్లు  55 పాయింట్లు పెరిగిన నిఫ్టీ  

ముంబై: ఆరంభ లాభాలను కోల్పోయినా.., మార్కెట్‌ మూడురోజూ లాభంతో ముగిసింది. ఇంట్రాడేలో 456 పాయింట్లు ర్యాలీ చేసిన సెన్సెక్స్‌ చివరికి 84 పాయింట్ల లాభంతో 49,746 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 165 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 55 పాయింట్లకు పరిమితమై 14,873 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్లు మెటల్‌ షేర్లను కొనేందుకు అధిక ఆసక్తి చూపారు. ఉక్కు ఉత్పత్తితో పాటు ధరలు కూడా పెరుగుతుండటంతో ఈ రంగ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. దీంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నాలుగుశాతం ర్యాలీ చేసింది. రూపాయి 11 పైసల పతనం కావడం ఐటీ షేర్లకు కలిసొచ్చింది.

వీటితో పాటు రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లు కూడా రాణించాయి. మరోవైపు బ్యాంకింగ్‌ షేర్లతో పాటు ఆర్థిక, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆర్‌బీఐ సర్దుబాటు వైఖరికి మద్దతుగా ఉదయం సెషన్‌లో కొనుగోళ్లు జరిగాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి బ్యాంకింగ్‌ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 111 కోట్ల పెట్టుబడులు పెట్టగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.553 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. వడ్డీరేట్లపై మరిన్ని రోజులు సానుకూల వైఖరినే ప్రదర్శించాల్సి ఉంటుందని ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశపు మినిట్స్‌లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పరిమితి లాభాలతో కదలాడుతున్నాయి.  

మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలు...  
ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 223 పాయింట్ల లాభంతో 49,885 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగిన 14,875 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెటల్, ఐటీ, రియల్టీ రంగాల షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 50 వేల స్థాయి అందుకుంది. గరిష్టంగా 456 పాయింట్లు ఎగసి  50,118 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 14,984 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మిడ్‌ సెషన్‌ సమయంలో యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో కదలాడటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సూచీలు కొంతమేర ఉదయం లాభాల్ని కోల్పోయాయి.  

మార్కెట్‌లో మరిన్ని సంగతులు...  
► రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో టాటా స్టీల్‌ షేరు రూ.956 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 5% లాభంతో రూ.918 వద్ద ముగిసింది.  
► క్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మెరుగైన ఉత్పత్తిని సాధించడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు తొమ్మిది శాతం లాభంతో రూ.614 వద్ద స్థిరపడింది.  
► బార్బెక్యూ నేషన్‌ హాస్పిటాలిటీ షేరు వరుసగా రెండోరోజూ 20 శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ.705 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు