సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 40,070, నిరోధం 41,040

12 Oct, 2020 06:10 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

గతవారం ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ స్వల్ప ఒడిదుడుకులకు లోనైనప్పటికీ,   భారత్‌ సూచీలు మాత్రం ఏ రోజుకారోజు పెరుగుతూ పోయాయి. కొద్దివారాల క్రితం అమెరికా సూచీలు సృష్టించిన రికార్డుస్థాయిల్ని మరోదఫా పరీక్షించేందుకు సిద్ధమవుతుండగా, జర్మనీతో పాటు భారత్‌ మార్కెట్‌ ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయికి చేరువవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థల్లో వెల్లువెత్తుతున్న లిక్విడిటీ కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్‌ను ఇప్పట్లో అంచనా వేయలేము. అలాగే మరో మూడు వారాల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావంతో అమెరికా, జర్మనీ, భారత్‌ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనైనా నూతన రికార్డుల్ని నెలకొల్పే సంకేతాలు అధికంగా కన్పిస్తున్నాయి.  ఇక  స్టాక్‌ సూచీల స్వల్పకాలిక సాంకేతిక అంశాలకొస్తే....  

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు
అక్టోబర్‌  9తో ముగిసిన వారంలో భారీ ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,812  పాయింట్ల  లాభంతో 40,509 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమైతే  41,040  పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు.  ఈ అవరోధస్థాయిని దాటి, ముగిస్తే 41,400 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన 41,700 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు, తొలి నిరోధాన్ని సెన్సెక్స్‌ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా  40,070 పాయింట్ల వద్ద  తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 39,960 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే 39,450 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.

నిఫ్టీ తక్షణ నిరోధం 12,010
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 497 పాయింట్ల భారీ లాభంతో 11,914 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే, 12,010 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 12,160 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే ర్యాలీ వేగవంతమై  12,250 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోతే 11,790 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే  11,760 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 11,680 పాయింట్ల వద్ద  మద్దతు లభిస్తున్నది.

– పి. సత్యప్రసాద్‌

మరిన్ని వార్తలు