11,600 పాయింట్ల పైకి నిఫ్టీ...

17 Sep, 2020 07:22 IST|Sakshi

 పుంజుకున్న రూపాయి.. జోష్‌నిచ్చిన ఆర్‌బీఐ గవర్నర్‌ భరోసా 

సెన్సెక్స్‌ 259 పాయింట్లు అప్‌; నిఫ్టీ 83 పాయింట్లు జంప్‌

బ్యాంక్, వాహన, ఐటీ, ఫార్మా  షేర్ల జోరుతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 73.52 వద్ద ముగియడం, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత  దాస్‌ భరోసా వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. నిఫ్టీ కీలకమైన 11,600 పాయింట్ల  పైకి ఎగబాకింది. 83 పాయింట్లు లాభపడి 11,605 వద్ద ముగిసింది.  ఫిబ్రవరి తర్వాత ఈ సూచీ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఇక సెన్సెక్స్‌  259 పాయింట్లు ఎగసి 39,303 పాయింట్ల వద్దకు చేరింది.  స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి.  

బ్లూ చిప్‌ షేర్లలో కొనుగోళ్లు....
రేట్ల నిర్ణయానికి సంబంధించి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక నిర్ణయం ఈ రాత్రికి వెలువడనున్న నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం సానుకూల ప్రభావం చూపించింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం లాభాలను పరిమితం చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్‌ మహీంద్రా.. ఈ బ్లూచిప్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి.

ఆర్‌బీఐ అభయం...: ఆర్థిక రికవరీ ఇంకా పుంజుకోలేదని, అయినప్పటికీ, నిధుల లభ్యత పెంచడానికి, వృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభయం ఇచ్చారు.  ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  

► మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 4 శాతం లాభంతో రూ.640 వద్ద  ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఇండియన్‌ ఎనర్జీ ఎక్సే ్చంజ్,లారస్‌ ల్యాబ్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► 250కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకా యి. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌.గంధిమతి అప్లయెన్సెస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు