NSE NIFTY 50: మళ్లీ రికార్డుల బాట

13 Aug, 2021 01:26 IST|Sakshi

కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు

ఫార్మా తప్ప అన్ని షేర్లలో కొనుగోళ్లు

ఇంట్రాడే, ముగింపుల్లో సరికొత్త రికార్డులు

సెన్సెక్స్‌ లాభం 318 పాయింట్లు 16,350పైన నిఫ్టీ ముగింపు  

ముంబై: ఒకరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ కదంతొక్కాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గురువారం ఇంట్రాడే, ముగింపుల్లో సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులకు లోనైన సూచీలు.., వెంటనే తేరుకొని మార్కెట్‌ ముగిసే వరకు ఎలాంటి తడబాటు లేకుండా స్థిరమైన ర్యాలీ చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 348 పాయింట్లు ఎగసి 54,874 వద్ద ఆల్‌టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 318 పాయింట్ల లాభంతో 54,845 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 93 పాయింట్లు పెరిగి 16,375 వద్ద సరికొత్త గరిష్టాన్ని లిఖించింది.

మార్కెట్‌ ముగిసే సరికి 82 పాయింట్ల లాభంతో 16,364 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, బ్యాంకింగ్, విద్యుత్‌ రంగాల షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఈ వారం ఆరంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లలో విరివిగా కొనుగోళ్లు జరిగాయి. ఫలితంగా బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు రెండుశాతం వరకు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ సూచీలో మొత్తం 30 షేర్లలో తొమ్మిది షేర్లు మాత్రమే నష్టపోయాయి. సూచీల రికార్డు ర్యాలీతో ఒకేరోజులో ఇన్వెస్టర్లు రూ.2 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మార్కెట్‌క్యాప్‌ రూ.239 లక్షల కోట్లకు చేరింది.

రికార్డు ర్యాలీ ఎందుకంటే..?
అమెరికా రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెలువడటంతో యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను ఇప్పట్లో పెంచకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. డిమాండ్‌ ఊపందుకోవడంతో రెండో క్వార్టర్‌లో బ్రిటన్‌ మెరుగైన జీడీపీ వృద్ధిని సాధించింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఇక జాతీయంగా ఫారెక్స్‌ మార్కెట్‌ నుంచి సానుకూల సంకేతాలు అందాయి. డాలర్‌ మారకంలో రూపాయి 19 పైసలు ఎగసి 74.25 వద్ద స్థిరపడింది.

గత మూడురోజుల ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా పతనాన్ని చవిచూసిన నాణ్యమైన మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ప్యాసింజర్‌ వాహన విక్రయాలకు సంబంధించి జూలైలో వార్షిక ప్రాతిపదికన 45% వృద్ధి నమోదైనట్లు ఆటో పరిశ్రమ సంఘం సియామ్‌ తెలిపింది. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్స్‌ భావించే ఈక్విటీల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపారు.

‘మార్కెట్‌ ముందుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ జరగవచ్చు. స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌ మంచిది.  గురు వారం విడుదలైన జూలై రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించనున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ 16300 స్థాయిపై ముగిసింది. తదుపరి 16500 వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. దిగువ స్థాయిలో 16250 వద్ద తక్షణ మద్దతు ఉంది’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

ఆప్టాస్‌ అదుర్స్‌.. కెమ్‌ప్లాస్ట్‌ ఓకే
ముంబై: చెన్నైకి చెందిన ప్రత్యేక రసాయనాల కంపెనీ కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ ఐపీఓకు ఓ మోస్తరు స్పందన లభించింది. చివరి రోజు నాటికి 2.17 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3.99 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా.. మొత్తం 8.66 కోట్లు బిడ్లు దాఖలైనట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 2.29 రెట్లు ఎక్కువ దరఖాస్తులు లభించాయి.

ఆప్టాస్‌ వేల్యూ 17 రెట్లు...
ఆప్టాస్‌ వేల్యూ హౌసింగ్‌ ఐపీఓకు మంచి స్పందన లభించింది. మూడో రోజు నాటికి 17.20 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 5.51 కోట్ల షేర్లను జారీ చేసింది. మొత్తం 94.82 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 71.35 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి.

మరిన్ని వార్తలు