పాలసీ ముందు లాభాలు

8 Oct, 2021 05:10 IST|Sakshi

488 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

17800 పాయింట్ల చేరువలో నిఫ్టీ 

కలిసొచి్చన రూపాయి రికవరీ 

చల్లారిన ముడి చమురు ధరలు

ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ ప్రకటనకు ముందురోజు స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ముగిసింది. గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక వడ్డీరేట్లపై నిర్ణయాలను, ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌పై అభిప్రాయాన్ని నేడు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. క్రూడాయిల్‌ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టం నుంచి దిగివచ్చాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మూడురోజుల వరుస నష్టాలకు ముగింపు పలికింది.

మూడీస్‌తో సహా పలు అంతర్జాతీయ రేటింగ్‌లు భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌ను పెంచాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు తగ్గుముఖం పట్టాయి. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్లో సానుకూల వాతావారణాన్ని నెలకొల్పాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 488 పాయింట్లు పెరిగి 59,678 వద్ద, నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 17,790 వద్ద ముగిశాయి. దీంతో క్రితం రోజు నష్టాలన్నీ రికవరీ అయినట్లైంది. ఇంధన గ్యాస్‌ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది.

సెమి కండక్టర్ల కొరత ఉన్నప్పటికీ.., పండుగ సీజన్‌లో అమ్మకాలు ఊపందుకోవచ్చనే ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల క్యూ2 విక్రయాలు అంచనాలకు మించి నమోదుకావడంతో ఈ రంగ షేర్ల లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ రియల్‌ ఎస్టేట్‌ ఇండెక్స్‌ ఏకంగా 12 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ విధాన వెల్లడి(నేడు)కి ముందు బ్యాంకింగ్, కన్జూమర్‌ కౌంటర్లలో సందడి నెలకొంది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ నేడు క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడించనున్న నేపథ్యంలో ఐటీ రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ రెండు శాతం చొప్పున ఎగిశాయి.

విదేశీ ఇన్వెస్టర్లు రూ.1764 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2529 కోట్ల షేర్లను అమ్మారు. క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో పాటు అగ్రరాజ్యం అమెరికాలో డెట్‌–సీలింగ్‌(రుణాలకు చట్టబద్ధమైన ఆమోదం) చర్చలు ఓ కొలిక్కిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట వీడాయి. ఆసియాలో ఒక్క ఇండోనేషియా మార్కెట్‌ తప్ప మిగితా అన్ని దేశాల స్టాక్‌ సూచీలు లాభాలతో ముగిశాయి. సెలవుల కారణంగా  చైనా ఎక్సే్ఛంజీలు పనిచేయడం లేదు. యూరప్‌ మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం నుంచి ఒకటిన్నర లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  

టైటాన్‌ విలువ @ రూ.2 లక్షల కోట్లు: వజ్రాభరణాల తయారీ, విక్రయ సంస్థ టైటాన్‌ షేర్లు ట్రేడింగ్‌లో మెరిశాయి. రెండో క్వార్టర్‌లో బలమైన డిమాండ్‌ నెలకొనడంతో వ్యాపారంలో వేగవంతమైన రికవరీని సాధించిమని కంపెనీ ప్రకటించింది. ఇంట్రాడేలో ఈ షేర్లు  11 శాతం లాభపడి రూ.2,383 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకున్నాయి. చివరికి రూ. 2,376 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2.10 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. టీసీఎస్‌ తర్వాత టాటా గ్రూప్‌ నుంచి రూ.2 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అందుకున్న రెండో కంపెనీ టైటాన్‌ నిలిచింది.

మరిన్ని వార్తలు