సెన్సెక్స్‌ప్రెస్‌.. ఆటో, ఐటీ స్పీడ్

28 Jul, 2020 15:53 IST|Sakshi

558 పాయింట్ల హైజంప్‌

38,493 వద్ద ముగింపు

నిఫ్టీ 165 పాయింట్లు ప్లస్

‌మెటల్‌, రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ దన్ను

కొద్ది రోజుల కన్సాలిడేషన్‌ తదుపరి తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 558 పాయింట్లు జంప్‌చేసింది. 38,493 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 11,300 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలతో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడిచేకొద్దీ మరింత ఊపందుకున్నాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,555 వద్ద గరిష్టాన్ని చేరగా.. 37,998 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదేవిధంగా నిఫ్టీ 11,318- 11,151 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. యూఎస్‌, యూరోపియన్‌ దేశాల ప్యాకేజీలు, ఫెడ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో మీడియా(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఆటో, ఐటీ, మెటల్‌ 3.2-2.25 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో రియల్టీ 1.6 శాతం, ఫార్మా 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్ 7 శాతం జంప్‌చేయగా.. కొటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌, హిందాల్కో, శ్రీ సిమెంట్‌, హీరో మోటో 5-4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐసీఐసీఐ, ఇన్‌ఫ్రాటెల్‌, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, జీ 1.8-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

జీఎంఆర్ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో జీఎంఆర్‌, అపోలో హాస్పిటల్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎస్కార్ట్స్‌, రామ్‌కో సిమెంట్‌, అంబుజా సిమెంట్‌ 8.4-4.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. బీఈఎల్‌, హావెల్స్‌, ముత్తూట్‌, బర్జర్‌ పెయింట్స్‌, పెట్రోనెట్‌, ఐసీఐసీఐ ప్రు, యూబీఎల్‌ 3.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1335 లాభపడగా.. 1311 నష్టపోయాయి.

అమ్మకాలవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 453 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 978 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.  వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 410 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..   డీఐఐలు రూ. 1003 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.  

మరిన్ని వార్తలు