సెన్సెక్స్‌–నిఫ్టీ.. రేసు గుర్రాలు

9 Feb, 2021 06:26 IST|Sakshi

617 పాయింట్లు అప్‌; 51,349 వద్ద క్లోజ్‌

తొలిసారి 51,000 ఎగువకు సెన్సెక్స్‌

నిఫ్టీ 192 పాయింట్ల హైజంప్‌;15,116 వద్ద ముగింపు

6వ రోజూ మార్కెట్ల ర్యాలీ; రికార్డ్స్‌ బ్రేక్‌

ఆటో, మెటల్, ఐటీ, రియల్టీ జూమ్‌

ముంబై: కోవిడ్‌–19 నేపథ్యంలోనూ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధిస్తుండటం, వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రకటించడం వంటి అంశాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు రేసు గుర్రాల్లా పరుగెడుతున్నాయి. వీటికి జతగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్‌ 617 పాయింట్లు జంప్‌చేసి 51,349 వద్ద ముగిసింది. నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 15,116 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్‌ 51,523 వద్ద, నిఫ్టీ 15,160 వద్ద సరికొత్త రికార్డులను అందుకున్నాయి. విదేశీ మార్కెట్లలోనూ బుల్లిష్‌ ట్రెండ్‌ నెలకొనడంతో దేశీయంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.  

బ్లూచిప్స్‌ స్పీడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, మెటల్, ఐటీ, రియల్టీ 3.2–2 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసీజీ 1–0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, హిందాల్కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్‌ ఫిన్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, ఎయిర్‌టెల్, గెయిల్, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ 7.4–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బ్రిటానియా, హెచ్‌యూఎల్, కొటక్‌ బ్యాంక్, దివీస్‌ ల్యాబ్స్, బజాజ్‌ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్, ఐటీసీ 2–0.4 శాతం మధ్య నీరసించాయి.

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో కంకార్, రామ్‌కో సిమెంట్, ఎక్సైడ్, అదానీ ఎంటర్, నౌకరీ, సెయిల్, కోఫోర్జ్, మదర్‌సన్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, భారత్‌ ఫోర్జ్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, అమరరాజా 7–5 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. మరోపక్క భెల్, పీఎన్‌బీ, మణప్పురం, ఐడియా, గోద్రెజ్‌ సీపీ, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, బీవోబీ 3.7–1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నేటి ట్రేడింగ్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో దాదాపు రూ. 1,877 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 505 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.

2.5 లక్షల కోట్లు ప్లస్‌
మార్కెట్ల తాజా ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువకు రూ. 2.5 లక్షల కోట్లు జమయ్యింది. గత 6 రోజుల్లో రూ. 16.7 లక్షల కోట్లు బలపడింది. దీంతో బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రస్తుతం రూ. 202.82 లక్షల కోట్లకు చేరింది. ఇది కూడా రికార్డు కావడం విశేషం!

స్టాక్స్‌ విశేషాలివీ
n    బడ్జెట్‌లో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచడంతో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వరుసగా ఆరో రోజు ర్యాలీతో 52 వారాల గరిష్టానికి చేరింది.  
n    క్యూ3లో నిర్వహణ లాభం 28% పెరగడంతో శ్రీ సిమెంట్‌ షేరు కొత్త గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది.  6 రోజుల్లో ఈ షేరు 23% ర్యాలీ చేసింది.
n    క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఎలక్ట్రికల్స్, గుజరాత్‌ గ్యాస్, అఫ్లే ఇండియా కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది.
n    ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 23.5% వాటాను సొంతం చేసుకోవడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 52 వారాల గరిష్టానికి చేరింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు