మార్కెట్‌కు జీడీపీ జోష్‌

2 Mar, 2021 05:35 IST|Sakshi

ఆర్థిక గణాంకాల అండతో మెరుగైన లాభాలు  

ఆందోళన తగ్గించిన బాండ్‌ ఈల్డ్స్‌ స్వల్ప పతనం

సెన్సెక్స్‌ లాభం 750 పాయింట్లు

232 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు స్వల్ప నష్టాలు

ముంబై: మెరుగైన ఆర్థిక గణాంకాల అండగా స్టాక్‌ మార్కెట్‌ సోమవారం మెండుగా లాభాలను మూటగట్టుకుంది. ఇటీవల ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్న బాండ్‌ ఈల్డ్స్‌ కొంత దిగిరావడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన 1.9  ట్రిలియన్‌ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీకి అడ్డంకులు తొలగడం కూడా ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. దేశంలో రెండో దశ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కావడం కూడా సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ఫలితంగా సెన్సెక్స్‌ 750 పాయింట్లు లాభపడి 49,850 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 232  పాయింట్లు పెరిగి 14,762 వద్ద ముగిసింది. ఒక్క ప్రభుత్వ రంగ షేర్లకు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. కొనేవారే తప్ప అమ్మేవారు లేకపోవడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 958 పాయింట్లు, నిఫ్టీ 278 పాయింట్ల మేర లాభపడ్డాయి.  ఇరు సూచీల్లో ఒక్క ఎయిర్‌టెల్‌(4 శాతం) మాత్రమే నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.125 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.195 కోట్ల పెట్టుబడులను విక్రయించారు. మార్కెట్‌ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.3 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. దీంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.204 లక్షల కోట్లకు చేరుకుంది.  

‘‘చివరి రెండు క్వార్టర్లతో పోలిస్తే డిసెంబర్‌ త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత పుంజుకున్నట్లు గత శుక్రవారం విడుదలైన జీడీపీ గణాంకాలతో వెల్లడైంది. జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఐదో నెలలో కూడా రూ.లక్ష కోట్ల మార్కును సాధిస్తూ ఈ ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆటోమొబైల్‌ కంపెనీల  విక్రయాలు ఫిబ్రవరిలో రెండింతల వృద్ధిని సాధించాయి. దేశంలో తయారీ సంస్థలు భారీ స్థాయిలో కొత్త ఆర్డర్లు అందుకోవడంతో మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ ఆశించిన స్థాయిలోనే 57.5గా నమోదైంది. ఈ సానుకూల ఆర్థికాంశాలకు తోడు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాల బాటపట్టడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ అద్భుతమైన రికవరీని సాధించగలిగింది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు.


నాలుగు శాతం నష్టపోయిన ఎయిర్‌టెల్‌
సూచీలు సోమవారం భారీ లాభాలన్ని ఆర్జించినప్పటికీ.., భారతీ ఎయిర్‌టెల్‌ షేరు మాత్రం నాలుగు శాతం నష్టపోయింది. ఆసియాకు చెందిన  ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ కోర్‌ స్ట్రాటజీస్‌ పీటీఈ ఈ కంపెనీ చెందిన 3.7 కోట్ల షేర్లను విక్రయించింది. అలాగే టెలికాం రంగంలోని తన ప్రధాన ప్రత్యర్థి రిలయన్స్‌ జియో ఆదివారం జియోఫోన్‌ 2021ను ఆవిష్కరించింది. ఈ రెండు అంశాలతో ఎయిర్‌టెల్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 6%కి పైగా నష్టపోయి రూ.521 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి నాలుగు శాతం నష్టంతో రూ.532 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో నష్టాన్ని చవిచూసిన ఏకైక షేరు ఇదే కావడం గమనార్హం.

ఇతర ముఖ్యాంశాలివీ...
► ఈఎంఓ సమర్పణకు ప్రభుత్వం తేదీని పొడిగించడంతో బీఈఎంఎల్‌ షేరు 8% లాభపడి రూ.1160 వద్ద ముగిసింది.
► ప్రైవేటీకరణ ఆశలతో కొంతకాలం ర్యాలీ చేసిన ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. ఈ రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో ఎన్‌ఎస్‌ఈలోని పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయింది.  
► వీఐఎక్స్‌ ఇండెక్స్‌ 9% దిగివచ్చింది.
► సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను కొనుగోలు చేయడంతో గత శుక్రవారం లిస్టయిన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేరు 17 శాతం లాభపడి రూ.142 వద్ద స్థిర  పడింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు