బుల్‌ బౌన్స్‌బ్యాక్‌

13 Nov, 2021 04:54 IST|Sakshi

మూడురోజుల తర్వాత లాభాలు 

రెండు వారాల గరిష్టానికి సూచీలు

కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ 

ప్రపంచ మార్కెట్ల రికవరీ

సెన్సెక్స్‌ లాభం 767 పాయింట్లు

మళ్లీ 18000 ఎగువకు నిఫ్టీ

ముంబై: మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడితో తడబడిన బుల్‌ శుక్రవారం లాభాల బాటలో దూసుకెళ్లింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలను ఆసరాగా చేసుకొని ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ భయాలను విస్మరించి కొనుగోళ్లు చేపట్టారు. ఇటీవల మార్కెట్‌ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్సుల్లో షార్ట్‌ కవరింగ్‌ చోటుచేసుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్‌లు మూడు శాతం మేర రాణించి సూచీల రికవరీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు అంతుకు ముందు కోల్పోయిన  కీలకమైన 60వేలు, 18వేల స్థాయిని తిరిగి అందుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మీడియా షేర్లు మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూశాయి.

మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్‌ 767 పాయింట్లు పెరిగి 60,687 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 18,103 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సెన్సెక్స్‌ సూచీలోని 30 షేర్లకు గానూ ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.511 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.77 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్‌ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడ్డాయి.  

నిరాశపరిచిన ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌...  
లాభాల మార్కెట్లోనూ ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ లిస్టింగ్‌ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.577 కాగా.., రూ.548 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11 శాతం వరకూ పతనమై రూ.534 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి ఐదున్నర శాతం నష్టంతో రూ.545 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ ఎక్సే్చంజ్‌లో 6.24 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్‌ విలువ రూ.4,537 కోట్ల వద్ద స్థిరపడింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
► విదేశీ పెట్టుబడులకు ప్రామాణికంగా భావించే ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో చోటు దక్కించుకోవడంతో జొమాటో షేరు ఇంట్రాడేలో పది శాతం పెరిగి రూ.155 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి రూ.153 వద్ద ముగిసింది.  
► విమాన ప్రయాణికుల రద్దీ అక్టోబర్‌లో పెరగడం ఇండిగో షేరుకు కలిసొచ్చింది. బీఎస్‌ఈ లో ఏడు శాతం లాభంతో రూ.2305 వద్ద స్థిరపడింది. ఏకంగా 929.57 కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి.
► నైకా షేరుకు డిమాండ్‌ తగ్గడం లేదు. ఇంట్రాడేలో తొమ్మిది శాతం పెరిగి రూ.2410 వద్ద ఆల్‌ టైం హైని నమోదుచేసింది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.2359 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు