సెన్సెక్స్‌కు లాభాలు.. నిఫ్టీకి నష్టాలు..!

13 Feb, 2021 06:18 IST|Sakshi

ఆర్థిక గణాంకాల ప్రకటన

నేపథ్యంలో అప్రమత్తత  

యూరప్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు

ఆదుకున్న చివరి అరగంట కొనుగోళ్లు

ముంబై: చివరి అరగంటలో బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో  శుక్రవారం సూచీలు మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 544 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 13 పాయింట్ల స్వల్ప లాభంతో 51,544 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయి సూచీకి ఆల్‌టైం హై విశేషం. అలాగే ట్రేడింగ్‌లో 162 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ ఇండెక్స్‌ 10 పాయింట్ల పరిమిత నష్టంతో 15,163 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మీడియా రంగాల షేర్లు నష్టపోయాయి. ‘‘డిసెంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి, జనవరి ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. మరోవైపు మిడ్‌సెషన్‌లో యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడం మార్కెట్‌   సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ప్రతికూలాంశాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు’’ అని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు తెలిపారు. ఈ వారంలో సెన్సెక్స్, 812 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 239 పాయింట్లు   పెరిగింది.

ఉదయం సెషన్‌లో లాభాలు  
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల ఆకర్షణీయమైన క్యూ3 ఆర్థిక గణాంకాలను ప్రకటిస్తున్న కంపెనీల షేర్లు రాణించాయి. దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం తిరిగి ప్రారంభం కావడం ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో అన్ని రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 273 పాయింట్లు లాభపడి 51,804 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 15,243 వద్ద ఇంట్రాడే హైని అందుకుంది.

మిడ్‌ సెషన్‌లో అనూహ్య అమ్మకాలు  
అంతా సజావుగా సాగుతున్న తరుణంలో మిడ్‌సెషన్‌లో బ్రిటన్‌ ఎకానమీపై ప్రతికూల వార్తలు  వెలువ డటంతో యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. ఫలి తంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం నుంచి 544 పా యింట్లు, నిఫ్టీ 162 పాయింట్లను నష్టపోయాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు