సెన్సెక్స్‌ తక్షణ నిరోధం 38,385

27 Jul, 2020 06:28 IST|Sakshi

పలు దేశాల్లో కోవిడ్‌ కేసులు ఉధృతంకావడంతోపాటు, అమెరికా–చైనాల వివాదం ముదరడంతో గతవారం ప్రపంచ ప్రధాన మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌పడింది. భారత్‌ మార్కెట్‌ మాత్రం రిలయన్స్‌ ఇండస్ట్రీస్,  ఇన్ఫోసిస్‌ల తోడ్పాటుతో క్రితం వారం లాభపడింది. ఒక్క రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ మినహా మిగిలిన ఇండెక్స్‌ హెవీవెయిట్ల క్యూ1 ఫలితాలు వెలువడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,  యాక్సిస్‌బ్యాంక్‌ల ఫలితాలు మార్కెట్‌  అంచనాల్ని మించగా, మిగిలిన కంపెనీలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చలేదు. బ్యాంకింగ్‌ షేర్లలో గరిష్టస్థాయి వద్ద కొనసాగుతున్న అమ్మకాల కారణంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,  యాక్సిస్‌ బ్యాంక్‌లు ముందడుగు వేయలేకపోయాయి. ఇన్ఫోసిస్‌ మాత్రం మరో కొత్త రికార్డుస్థాయిని అందుకుంది. ఇక 14–15 శాతం వెయిటేజీతో ఇటీవల అతిపెద్ద హెవీవెయిట్‌గా అవతరించిన రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌ ఈ వారం ద్వితీయార్ధంలో వెల్లడించబోయే ఫలితాలు, అనుబంధ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ ఆకర్షించబోయే పెట్టుబడుల అంచనాలు, ఈ వారం భారత్‌ మార్కెట్‌ కదలికలకు కీలకం కావొచ్చు. ఇక స్టాక్‌  సూచీల సాంకేతిక అంశాలకొస్తే...  

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కీలకమైన 36,980 పాయింట్ల స్థాయిపైన ర్యాలీ వేగవంతమవుతుందంటూ గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించినరీతిలోనే వేగంగా పెరిగిన సూచి 38,235 పాయింట్ల గరిష్టస్థాయిని  అందుకుంది. జులై 24తో ముగిసినవారంలో చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,109 పాయింట్ల లాభంతో 38,129 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి 5 నాటి బ్రేక్‌డవున్‌ సందర్భంగా ఏర్పడిన  గ్యాప్‌ను పూడ్చాలంటే మరో 150 పాయింట్లు సెన్సెక్స్‌ ప్రయాణించాల్సివుంది. ఈ వారం...ఆ గ్యాప్‌ ఏరియా అప్పర్‌బ్యాండ్‌ అయిన 38,385 పాయింట్ల స్థాయి సెన్సెక్స్‌కు తక్షణ అవరోధం కానుంది. ఈ  అవరోధస్థాయిని దాటితే 38,540 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 38,880 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోయినా, మార్కెట్‌ బలహీనంగా  ప్రారంభమైనా 37,480 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 37,125 పాయింట్ల వరకూ పడిపోవొచ్చు. ఈ లోపున 36,900 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.    

నిఫ్టీ తక్షణ అవరోధం 11,245
క్రితం కాలమ్‌లో సూచించిన రీతిలోనే, గతవారం గ్యాప్‌అప్‌తో మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వేగంగా 12,239 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపింది.  చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 292 పాయింట్ల లాభంతో  11,194 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 11,245 సమీపంలో ఎదురయ్యే నిరోధం కీలకం. ఈ స్థాయిని దాటితే 11,310 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన క్రమేపీ 11,390 పాయింట్ల స్థాయిని  అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా మొదలైనా 11,040 పాయింట్ల వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే గత సోమవారంనాటి గ్యాప్‌అప్‌ స్థాయి  అయిన 10,930 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే ప్రస్తుతం 200  డీఎంఏ రేఖ కదులుతున్న 10,860 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి గట్టి మద్దతు లభిస్తున్నది.

>
మరిన్ని వార్తలు