చివర్లో బౌన్స్‌బ్యాక్‌

26 May, 2023 04:37 IST|Sakshi

సెన్సెక్స్‌ 99 పాయింట్లు అప్‌ 61,873 వద్ద ముగింపు

నిఫ్టీ 36 పాయింట్లు ప్లస్‌

ముంబై: రోజంతా నష్టాల మధ్యే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లో బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. వెరసి సెన్సెక్స్‌ 99 పాయింట్లు లాభపడి 61,873 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు బలపడి 18,321 వద్ద స్థిరపడింది. మే నెల డెరివేటివ్స్‌ ముగింపు నేపథ్యంలో తొలి నుంచీ మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 61,934 వద్ద గరిష్టాన్ని, 61,485 దిగువన కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ 18,338–18,202 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ప్రధానంగా చివరి అర్ధగంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు నష్టాలను వీడి లాభాల్లో నిలిచాయి.

రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, కన్సూ్యమర్‌ డ్యూరబుల్స్‌ 1–0.5 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.5 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఆటో, అదానీ ఎంటర్, ఎయిర్‌టెల్, ఐటీసీ, దివీస్, ఐషర్, టాటా కన్సూ్యమర్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బ్రిటానియా, కొటక్‌ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్‌ 3–1% మధ్య ఎగశాయి. అయితే విప్రో, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్, యూపీఎల్, హిందాల్కో, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, కోల్‌ ఇండియా 1.2–0.5 శాతం మధ్య డీలా పడ్డాయి.

చిన్న షేర్లు ఓకే
బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,802 లాభపడితే.. 1,687 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 589 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 338 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. గత 3 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 2,291 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. విదేశీ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.2 శాతం క్షీణించి 77.47 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 7 పైసలు తగ్గి 82.75ను తాకింది.

ఎల్‌ఐసీ జూమ్‌
క్యూ4లో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన ఎల్‌ఐసీ షేరు 2 శాతం వృద్ధితో రూ. 604 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 616వరకూ ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 6,357 కోట్లు బలపడి రూ. 3,81,777 కోట్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి 55.4 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

మరిన్ని వార్తలు