54000 పైకి సెన్సెక్స్‌

5 Aug, 2021 02:05 IST|Sakshi

నిఫ్టీ లాభం 129 పాయింట్లు కొనసాగిన రికార్డుల పరంపర

ర్యాలీకి అండగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు

ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు రాణించడంతో రెండోరోజూ సూచీల రికార్డుల పరంపర కొనసాగింది. కార్పొరేట్ల తొలి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారమూ ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదుచేశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 54వేల శిఖరాన్ని అధిరోహించింది. ఇంట్రాడేలో 643 పాయింట్లు ఎగసి 54,466 స్థాయిని అందుకుంది. చివరకి 546 పాయింట్ల లాభంతో 54,370 వద్ద ముగిసింది. నిఫ్టీ ఒకదశలో 159 పాయింట్లను ఆర్జించి 16,290 స్థాయిని చేరుకుంది. మార్కెట్‌ ముగిసేసరికి 128 పాయింట్ల లాభంతో 16,247 వద్ద స్థిరపడింది.

సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్సులు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండోరోజూ కొనుగోళ్లు చేశాయి. నికరంగా వారు రూ.2,829 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.411 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ మూడోరోజూ లాభపడింది. డాలర్‌ మారకంలో తొమ్మిది పైసలు బలపడి 74.19 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగానూ కార్పొరేట్‌ సంస్థలు మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. పలు దేశాల్లో కోవిడ్‌ –19 కేసుల ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ కదలాడుతున్నాయి.

మిడ్‌సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి...
ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 248 పాయింట్ల లాభంతో 54వేల పైన 54,071 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 16,195 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గు చూపారు. దీంతో తొలి సెషన్‌లో నిఫ్టీ 16,247 వద్ద, సెన్సెక్స్‌  54,466 వద్ద ఆల్‌టైం హైలను అందుకున్నాయి. అయితే యూరప్‌ మార్కెట్ల ప్రారంభం తర్వాత మిడ్‌సెషన్‌లో ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుకుంది. దీంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే చివరి గంటలో బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు రాణించడంతో సూచీలు సరికొత్త రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి.  

రికార్డు ర్యాలీకి బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల అండ...  
బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు రాణించి సూచీల రికార్డు ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలకు మించి నమోదుకావడంతో బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల జోలికెళ్లకపోవచ్చనే అంచనాలతో ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాం క్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు ఐదు నుంచి 3% ర్యాలీ చేశాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► తొలి క్వార్టర్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచి అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో ఎస్‌బీఐ షేరు రెండుశాతానికి పైగా లాభపడి రూ.457 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఐదుశాతం ర్యాలీ చేసి రూ.467 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది.  
► ఇండెక్స్‌ల్లో రిలయన్స్‌ తర్వాత అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ షేరు నాలుగున్నర శాతానికి పైగా లాభపడి రూ.2,672 వద్ద ముగిసింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలను ప్రకటన తర్వాత పలు అంతర్జాతీయ సంస్థలు ఈ షేరుకు బై రేటింగ్‌ కేటాయించాయి. ఫలితంగా ఈ షేరు నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో తొమ్మిదిన్నర శాతం ర్యాలీ చేసింది.  
► తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేరు మూడున్నర శాతం నష్టంతో రూ. 108.50 వద్ద ముగిసింది.  
► నిధుల సమీకరణ వార్తలను కంపెనీ కొట్టిపడేయడంతో వోడాఫోన్‌ ఐడియా షేరు రెండోరోజూ భారీ నష్టాలను చవిచూసింది. మార్కెట్‌ ముగిసే సరికి 19% క్షీణించి రూ.6 వద్ద స్థిరపడింది.

>
మరిన్ని వార్తలు