సరికొత్త శిఖరాలపై ముగింపు 

25 Aug, 2021 04:25 IST|Sakshi

మార్కెట్‌ను మెప్పించిన ఎన్‌ఎంపీ 

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు 

మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లలో కొనుగోళ్లు 

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు  

రూ.240 లక్షల కోట్లకు చేరిన ఇన్వెస్టర్ల సంపద  

ముంబై: మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు మంగళవారం సరికొత్త శిఖరాలపై ముగిశాయి. మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపీ) కార్యక్రమం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచినట్లు స్టాక్‌ నిపుణులు తెలిపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచీ సానుకూలతలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 403 పాయింట్ల లాభంతో 55,959 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 16,625 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు ఇరు సూచీలకు జీవితకాల ముగింపు స్థాయి. అలాగే వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం.  ఒక దశలో సెన్సెక్స్‌ 467 పాయింట్లు పెరిగి 56 వేల స్థాయిని అధిగమించి 56,023 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది.

నిఫ్టీ సైతం 151 పాయింట్లను ఆర్జించి 16,647 స్థాయిని తాకింది. కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు రెండుశాతం లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఐరన్‌ ఓర్‌ ఫ్యూచర్లు కుప్పకూలిపోవడంతో నాలుగు రోజులుగా నష్టాలను చవిచూసిన మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్చంజీల్లోని అన్ని సెక్టార్‌ ఇండెక్స్‌ల్లోకెల్లా ఈ మెటల్‌ సూచీ అత్యధికంగా మూడుశాతం ర్యాలీ చేసింది. ట్రేడింగ్‌ తొలి భాగంలో రాణించిన ఐటీ షేర్లలో మిడ్‌సెషన్‌ తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీలు కొత్త గరిష్టాలపై ముగిసిన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.2.79 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ మొత్తం రూ.240 లక్షల కోట్లకు చేరింది.

విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,645 కోట్ల షేర్లను అమ్మగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.2,380 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మూడు పైసలు బలపడి 74.19 వద్ద స్థిరపడింది. ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ ఆవిష్కరించిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌కు యూఎస్‌ఎఫ్‌ఎడీఏ పూర్తి స్థాయి అనుమతులు జారీ చేసింది. దీంతో వ్యాక్సినేషన్‌ వేగవంతం, ఆర్థిక రికవరీ ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. 

రెండు లిస్టింగ్‌లూ డీలా..  
ఆప్టస్‌ వ్యాల్యూ హౌసింగ్‌ ఫైనాన్స్, కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ లిస్టింగ్‌లు రెండూ నిరాశపరిచాయి. ఆప్టస్‌ వ్యాల్యూ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.353తో పోలిస్తే ఆరున్నర శాతం నష్టంతో రూ.330 వద్ద లిస్టయ్యాయి. మార్కెట్‌ ర్యాలీలో భాగంగా లిస్టింగ్‌ నష్టాలను పూడ్చుకున్నప్పటికీ.., లాభాలతో గట్టెక్కలేకపోయాయి. చివరికి రెండుశాతం నష్టంతో రూ.347 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈలో మొత్తం 16 లక్షల షేర్లు చేతులు మారగా, కంపెనీ మార్కెట్‌ విలువ రూ.17,171 కోట్లుగా నమోదైంది.

ప్రత్యేక రసాయన తయారీ కంపెనీ కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ లిస్టింగ్‌ కూడా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. ఐపీఓ ఇష్యూ ధర రూ.541తో పోలిస్తే బీఎస్‌ఈలో ఈ షేర్లు మూడు శాతం నష్టంతో రూ.525 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఇంట్రాడేలో రూ.550 వద్ద గరిష్టాన్ని, రూ.510 స్థాయి వద్ద కనిష్టాన్ని నమోదుచేశాయి. చివరికి ఒకశాతానికి పైగా నష్టంతో రూ.535 వద్ద ముగిశాయి.  

100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో ఇన్ఫీ
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ కంపెనీ  అరుదైన ఘనత సాధించింది. ఇంట్రాడేలో కంపెనీ షేరు ఒక శాతానికి పైగా లాభపడి రూ.1,756 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తొలిసారి 100 బిలియన్‌ డాలర్ల మార్కు (రూ.7.47 లక్షల కోట్లు)ను అందుకుంది. తద్వారా 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరిన నాలుగో భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్‌ నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉన్నాయి. 

మరిన్ని వార్తలు