సూచీలకు పన్ను పోటు

25 Mar, 2023 03:17 IST|Sakshi

సెన్సెక్స్‌ నష్టం 398 పాయింట్లు

17 వేల దిగువకు నిఫ్టీ

ముంబై: ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్‌ కాంట్రాక్టులపై కేంద్రం సెక్యూరిటీ లావాదేవీల పన్ను 25 శాతం(0.05% నుంచి 0.0625 శాతానికి)పెంపుతో స్టాక్‌ సూచీలు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్‌ రంగంలో భయాలు దావానలంలా వ్యాప్తి చెందుతుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచింది. అలాగే డాలర్‌ రికవరీతో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 398 పాయింట్లు నష్టపోయి 57,527 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 17 వేల దిగువన 16,945 వద్ద నిలిచింది. ఉదయం సెషన్‌లో లాభాలతో కదలాడిన సూచీలు మిడ్‌ సెషన్‌ ముందు బలహీనపడ్డాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 57,423 – 58,066 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 16,917–17,109 రేంజ్‌లో ట్రేడైంది. ఆ తర్వాత కొద్దిసేపు లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు ఆఖర్లో అమ్మకాలు పోటెత్తడంతో వారాంతాన్ని నష్టాలతో ముగించాయి.

బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1720 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2556 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 82.40 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌ రంగ సంక్షోభంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.

ఏఎంసీ షేర్ల పతనం..
తాజా ఫైనాన్స్‌ బిల్లుతో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)ల ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాలిక పెట్టుబడి లాభాల పన్ను వర్తించనుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనయ్యారు. ప్రధానంగా యూటీఐ 4.7 శాతం, ఆదిత్య బిర్లా 4.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఇతర ఏఎంసీలు శ్రీరామ్‌ 3.2 శాతం, నిప్పన్‌ లైఫ్‌ ఇండియా 1.3 శాతం చొప్పున
క్షీణించాయి. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు