ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

29 Jul, 2020 09:26 IST|Sakshi

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు

ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

నష్టాల్లో ఐటీ షేర్లు

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 13 పాయింట్ల లాభంతో 38506 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 11314 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 22,219 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

భారతీ ఎయిర్‌టెల్‌, సియట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్లాక్సో ఫార్మా, హెరిటేజ్‌ ఫుడ్స్‌, ఇండిగో, మణప్పురం ఫైనాన్స్‌, మారుతి సుజుకీ, స్సైజ్‌ జెట్‌, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలతో సహా నేడు 180 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. నేటి రాత్రి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలను ప్రకటించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రేడింగ్‌లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

మిశ్రమంగా అంతర్జాతీయ సంకేతాలు:

అమెరికా మార్కెట్లు నిన్నరాత్రి నష్టాల్లో ముగిశాయి. బ్లూచిప్‌ కంపెనీ షేర్లలో అమ్మకాలతో పాటు నేడు ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల ప్రకటన నేపథ్యంలో అప్రమత్తత కారణంగా అక్కడి సూచీలు 0.50-1.50 శాతం మధ్య క్షీణించాయి. మన మార్కెట్‌ ప్రారంభసమయానికి ఆసియాలో సూచీలు అటుఇటు కదులుతున్నాయి. డాలర్‌ మారకంలో తన కరెన్సీ యెన్‌ విలువను తగ్గించుకోవడంతో చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. తైవాన్‌, థాయిలాండ్‌, కొరియా దేశాల ఇండెక్స్‌లు కూడా ఆరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు జపాన్‌, ఇండోనేషియా, సింగపూర్‌ దేశాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఆల్ట్రాటెక్‌, టాటామోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. శ్రీరాం సిమెంట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టాన్ని చవిచూశాయి.

మరిన్ని వార్తలు