బ్యాంక్.. క్రాష్

14 Mar, 2023 03:01 IST|Sakshi

అమ్మకాల వెల్లువ.. 5 నెలల కనిష్టం

సెన్సెక్స్‌ 897 పాయింట్లు పతనం

ఇంట్రాడేలో 1,416 పాయింట్లు డౌన్‌

చివరికి 58,238 వద్ద ముగింపు

259 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

బ్యాంకింగ్, మీడియా, ఆటో వీక్‌

ఉన్నట్టుండి యూఎస్‌ సంస్థ సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ)ను మూసివేయడంతో మరోసారి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు షాక్‌ తగిలింది. దీంతో యూరప్, ఆసియాసహా దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు క్షీణించగా.. ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ 5 నెలల కనిష్టాలకు చేరాయి.

ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 897 పాయింట్లు కోల్పోయి 58,238 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 259 పాయింట్లు దిగజారి 17,154 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. ఒక దశలో సెన్సెక్స్‌ 1,040 పాయింట్లు పడిపోయి 58,095 దిగువకు చేరింది. నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 17,113ను తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి యూఎస్‌లో తిరిగి ఒక పెద్ద బ్యాంకు దివాలా స్థితికి చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

సిల్వర్‌గేట్‌ క్యాపిటల్‌ కార్ప్‌ ఇప్పటికే మూతపడటానికితోడు సిగ్నేచర్‌ బ్యాంక్‌లో సంక్షోభం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. కాగా.. తొలుత మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 375 పాయింట్లు ఎగసి 59,511కు చేరింది. తదుపరి అమ్మకాలతో పట్టుతప్పి ఆ స్థాయి నుంచి మధ్యాహ్నానికల్లా 1,416 పాయింట్లు జారింది. మార్కెట్‌ పతనం నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్‌ఈ మార్కెట్‌ విలువలో రూ. 4.43 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. రూ. 2,58,56,296 కోట్లకు పరిమితమైంది.
 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. బ్యాంకింగ్, మీడియా, ఆటో 2.5 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఐటీ, కన్జూమర్‌ డ్యురబుల్స్, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ గ్యాస్‌ 2–1 శాతం మధ్య నీరసించాయి. సెన్సెక్స్‌లో కేవలం టెక్‌ మహీంద్రా(7%) జంప్‌చేయగా.. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఓఎన్‌జీసీ సైతం నిలదొక్కుకున్నాయి. అయితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7% కుప్పకూలింది. ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, ఐషర్, యాక్సిస్, బజాజ్‌ ఫిన్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హీరోమోటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, టైటాన్, ఆర్‌ఐఎల్‌ 3–1.5% మధ్య క్షీణించాయి.

యస్‌ బ్యాంక్‌ డౌన్‌
మూడేళ్ల లాకిన్‌ గడువు ముగియడంతో సోమవారం యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత 13% క్షీణించి రూ.14.4కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ.15.65 వద్ద క్లోజైంది.

విదేశీ బ్యాంకులు వెలవెల..
ఎస్‌వీబీ వైఫల్యం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో పలు బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కుప్పకూలాయి. రీజనల్‌ బ్యాంకు స్టాక్స్‌లో వెస్టర్న్‌ అలయెన్స్‌ 75 శాతం, ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ 65 శాతం, పాక్‌వెస్ట్‌ బ్యాంక్‌కార్ప్‌ 46 శాతం చొప్పున పడిపోయాయి. ఇక యూరోపియన్, అమెరికన్‌ దిగ్గజాలలో క్రెడిట్‌ స్వీస్, డాయిష్‌ బ్యాంక్, యూబీఎస్, బార్‌క్లేస్, ఐఎన్‌జీ, లాయిడ్స్, హెచ్‌ఎస్‌బీసీ 8–3 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, వెల్స్‌ఫార్గో, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్‌ చేజ్, గోల్డ్‌మన్‌ శాక్స్‌ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి.

పసిడి జోరు
బ్యాంకింగ్‌ వ్యవస్థపై భయాలతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ పెరిగింది. దీంతో కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) 2.4 శాతంపైగా(44 డాలర్లు) ఎగసి 1,911 డాలర్లను అధిగమించింది. దేశీయంగా(న్యూఢిల్లీ) 10 గ్రాముల ధర రూ. 970 బలపడి రూ. 56,550ను తాకింది. వెండి సైతం కేజీ రూ. 1,600 పుంజుకుని రూ. 63,820కు చేరింది. అయితే యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ క్షీణించాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్‌ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి, రెండేళ్ల బాండ్ల ఈల్డ్‌ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి నీరసించింది. ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలివ్వగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్లలో అత్యవసర కోతలు అవసరమంటూ కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు