మార్కెట్‌.. బౌన్స్‌బ్యాక్‌!

27 Nov, 2020 04:15 IST|Sakshi

నష్టాలు ఒకరోజుకే పరిమితం

ఆటుపోట్ల ట్రేడింగ్‌లో లాభాలదే పైచేయి

రాణించిన మెటల్, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లు 

సెన్సెక్స్‌ లాభం 432 పాయింట్లు

129 పాయింట్లు పెరిగిన నిఫ్టీ  

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ నవంబర్‌ సిరీస్‌ను లాభాలతో ముగించింది. ఎఫ్‌అండ్‌ఓ ముగింపు నేపథ్యంలో ట్రేడింగ్‌ ఆద్యంతం ఆటుపోట్లకు లోనైనప్పటికీ.., మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ర్యాలీ అండతో సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 432 పాయింట్లు పెరిగి 44,260 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్ల ఆర్జించి 12,987 వద్ద నిలిచింది. మార్కెట్‌లో నెలకొన్న బుల్లిష్‌ ట్రెండ్‌కు తగ్గట్లు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్‌ చేసుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కొనసాగడం,  అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్‌ వంటి అంశాలు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి.

పండుగ సీజన్‌లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పనితీరును కనబరిచినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 780 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ.2,027 కోట్ల షేర్లను కొనగా, దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ.3,400 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నవంబర్‌ సిరీస్‌లో సెన్సెక్స్‌ 4510 పాయింట్లను, నిఫ్టీ 1316 పాయింట్లు ఎగిశాయి.

ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌....
లాభాల స్వీకరణతో బుధవారం నష్టాలను చవిచూసిన మార్కెట్‌ గురువారం ఫ్లాట్‌గా మొదలైంది. ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌ ముగింపు రోజు కావడంతో ఆరంభంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో ఉదయం సెషన్‌లో సూచీలు లాభ – నష్టాల మధ్య ట్రేడ్‌ అయ్యాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మెటల్‌ షేర్లలో కొనుగోళ్లు మొదలవడంతో లాభాల బాట పట్టాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో మరింత దూసుకెళ్లాయి.

మరిన్ని వార్తలు