మళ్లీ నష్టాల్లోకి మార్కెట్‌

1 Apr, 2021 06:23 IST|Sakshi

అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణ 

ప్రపంచ మార్కెట్ల     ప్రతికూలతలు

50 వేల దిగువకు సెన్సెక్స్‌ 

నిఫ్టీ నష్టం 154 పాయింట్లు 

చిన్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ఆర్థిక సంవత్సరాన్ని(2020–21) నష్టాలతో ముగించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా భయాలతో ఇన్వెస్టర్లు అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌ షేర్లలో లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా బుధవారం సెన్సెక్స్‌ 627 పాయింట్లను కోల్పోయి 50 వేల దిగువున 49,509 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 154 పాయింట్లు నష్టపోయి 14,691 వద్ద నిలిచింది. దీంతో సూచీల రెండురోజుల లాభాలకు ముగింపు పడినట్లైంది.

అంతర్జాతీయంగా బాండ్‌ ఈల్డ్స్‌తో పెరగడంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనంగా కదలాడటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్, ఆర్థిక, ఐటీ, ఆటో రంగాల షేర్లలో విక్రయాలు జరిగాయి. వృద్ధి అవకాశాలకు ఆస్కారం ఉన్న మెటల్, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. వీటితో పాటు ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు కూడా రాణించాయి. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు అరశాతం చొప్పున ర్యాలీ చేశాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజున విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,686 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,082 కోట్ల  షేర్లను అమ్మారు.

‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మౌలిక రంగ ప్యాకేజీతో పాటు కార్పొరేట్‌ పన్నులు పెంపు నిర్ణయాన్ని వెల్లడించవచ్చనే అంచనాలతో ఈక్విటీ మార్కెట్లలో తిరిగి బలహీన వాతావరణం నెలకొంది. దీనికి తోడు యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 14 నెలల గరిష్టాన్ని తాకడంతో సెంటిమెంట్‌ మరింత బలహీనపడింది. కరోనా కేసులు అంతకంతా పెరుగుతూనే ఉన్నాయి’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెచ్‌ ఎస్‌ రంగనాథన్‌ తెలిపారు.  

నాలుగు శాతం నష్టపోయి హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు
బ్యాంకు సేవల్లో సాంకేతిక సమస్యలు వస్తున్న విషయాన్ని వెల్లడించంతో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.2,504 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 3.82 శాతం క్షీణించి రూ.1,494 వద్ద స్థిరపడింది.

2020–21లో మెరుపులు
భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ ఆర్థిక సంవత్సరం(2020–21)లో గడిచిన పదేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. కరోనా సవాళ్లను అధిగమిస్తూ, లాక్‌డౌన్‌ ఆంక్షల విధింపు అవాంతరాలు ఎదురైనా, సెన్సెక్స్‌ 20,041 పాయింట్లు, నిఫ్టీ 6,093 పాయింట్లను ఆర్జించాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు అధిక లాభాల్ని ఇచ్చాయి. సెన్సెక్స్‌ ఈ ఏడాది (2021) ఫిబ్రవరి 16 తేదిన 52,517 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15,423 వద్ద జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఆర్థిక ఇబ్బందులతో ఈక్విటీ మార్కెట్‌ పతనమైతే.., అది పెట్టుబడుల పెట్టేందుకు అవకాశంగా భావించాలని ఎఫ్‌వై 21 నిరూపించినట్లు స్టాక్‌ నిపుణులు తెలిపారు. ‘2008–09లో మార్కెట్‌ 40% పతనమైన నేపథ్యంలో  2009–10లో ఇన్వెస్టర్లకు 80% లాభాల్ని అందించింది. అవే పరిస్థితులు ఇప్పుడు పునరావృతమయ్యాయి. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ 30 శాతం దిద్దుబాటుకు గురైంది. తర్వాత ఏడాది అంటే 2020–21లో 68% రాబడిని ఇచ్చింది’’ ఎమ్‌కే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ జోసెఫ్‌ థామస్‌ తెలిపారు.

ఇన్వెస్టర్లకు కాసుల పంట..
స్టాక్‌ మార్కెట్‌ ఎఫ్‌వై 21లో 68 శాతం ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిసింది. కేవలం ఏడాది కాలంలోనే  రూ.91 లక్షల కోట్లను గడించారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ(మార్కెట్‌ క్యాప్‌) మార్చి 31 నాటికి రూ.204 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. 2021 మార్చి మూడో తేదీన మార్కెట్‌ క్యాప్‌ రూ.210 లక్షల కోట్లకు చేరుకొని జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది.

>
మరిన్ని వార్తలు