48,000 పైకి సెన్సెక్స్‌

5 Jan, 2021 03:40 IST|Sakshi

నిఫ్టీ లాభం 114 పాయింట్లు ∙తొమ్మిదోరోజూ లాభాలే 

ర్యాలీకి అండగా నిలిచిన మెటల్, ఐటీ షేర్లు 

సూచీలకు వ్యాక్సిన్‌ అనుమతుల ఉత్సాహం

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు 

కొనసాగిన రికార్డుల పర్వం

ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే రెండు వ్యాక్సిన్లకు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలపడంతో దేశీయ ఈక్విటీ సూచీలు తొమ్మిదోరోజూ లాభాలతో ముగిశాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలూ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే ఇటీవల వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా సోమవారమూ సూచీల ఇంట్రాడే, ముగింపు రికార్డు ర్యాలీ కొనసాగింది.

సెన్సెక్స్‌ 308 పాయింట్ల లాభంతో తొలిసారి 48 వేలపై 48,177 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 14,133 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నిఫ్టీ 194 పాయింట్లు, సెన్సెక్స్‌ 626 పాయింట్ల పరిధిలో ట్రేడయ్యాయి. ఒక్క ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. మెటల్, ఐటీ షేర్లు అత్యధికంగా లాభపడటమే కాకుండా సూచీలు రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. ప్రధాన దేశాల్లో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌కు అనుమతులు లభించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. విదేశీ పెట్టుబడులు వెల్లువలా కొనసాగుతుండటంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 9 పైసలు బలపడి 73.02 వద్ద స్థిరపడింది.  

626 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌...
కోవిడ్‌–19 కట్టడికి భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఒకేసారి కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు అనుమతులు లభించిన నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్‌ 48,000 పాయింట్లపైన, నిఫ్టీ 14,100 స్థాయిపైన మొదలయ్యాయి. కొద్దిసేపటికే ఇన్వెస్టర్లు గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఒక దశలో నిఫ్టీ 14వేల స్థాయిని కోల్పోయి 13,954 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్‌ సైతం 48 వేల మార్కును కోల్పోయి 47,594 వద్దకు దిగివచ్చింది. నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న సూచీలకు డిసెంబర్‌ పీఎంఐ గణాంకాలు ఊరటనిచ్చాయి. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ డిసెంబర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పీఎంఐ డాటా 56.4 పాయింట్లుగా నమోదైంది. మరోవైపు యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచి కూడా సూచీలు సానుకూల సంకేతాలను అందుకున్నాయి. దీంతో మిడ్‌సెషన్‌ నుంచి మళ్లీ కొనుగోళ్ల పర్వం మొదలవడంతో సూచీలు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ కనిష్టం నుంచి 626 పాయింట్లు లాభపడి 48,220 వద్ద, నిఫ్టీ ఇంట్రాడేలో నుంచి 194 పాయింట్లను ఆర్జించి 14,147 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.  

3.50% లాభపడ్డ బీఈఎంఎల్‌ షేరు
రక్షణరంగానికి చెందిన ప్రభుత్వరంగ కంపెనీ బీఈఎంఎల్‌ షేరు బీఎస్‌ఈలో 3.50 శాతం లాభపడింది. ఈ కంపెనీలో 26 శాతం వాటా ఉపసంహరించడంతో పాటు మేనేజ్‌మెంట్‌ నియంత్రణ కూడా బదిలీ చేసేందుకు కేంద్రం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను (ఈఓఐ) ఆహ్వానించడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 8 శాతం లాభపడి రూ.1,050 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 3.50 శాతం లాభంతో రూ.1,008 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు