మార్కెట్‌కు ఆర్‌బీఐ బూస్ట్‌!

8 Apr, 2021 05:49 IST|Sakshi

మెప్పించిన పాలసీ నిర్ణయం

రాణించిన బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, రియల్టీ షేర్లు

ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చిన భారీ రూపాయి పతనం

సెన్సెక్స్‌ లాభం 460 పాయింట్లు

14,800 పైన ముగిసిన నిఫ్టీ 

చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయం స్టాక్‌ మార్కెట్‌ను మెప్పించింది. కరోనా కష్టకాలంలో కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండా, సర్దుబాటు వైఖరికే ఆర్‌బీఐ కట్టుబడింది. ఫలితంగా వడ్డీరేట్లతో సంబంధం ఉన్న బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, రియల్టీ షేర్లు రాణించడంతో బుధవారం సెన్సెక్స్‌ 460 పాయింట్లు పెరిగి 49,662 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 136 పాయింట్లు ఎగసి 14,819 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్‌ 49,900 వద్ద, నిఫ్టీ 14,879 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులతో చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.

ఫలితంగా  సూచీలు కొంత లాభాల్ని కోల్పోయాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు(2021–22) జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అలాగే ఈ ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ 12.5 శాతం వృద్ది చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. భారత వృద్ధిరేటుపై ఆర్‌బీఐతో పాటు ఐఎంఎఫ్‌ల అంచనాలు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చాయి. అలాగే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు సైతం కలిసొచ్చాయి. వ్యవసాయ, గృహ రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నాబార్డ్, సిడ్బీ, ఎన్‌హెచ్‌బీ లాంటి ఫైనాన్సియల్‌ సంస్థలకు అదనంగా రూ.50 వేల కోట్ల నిధులను ప్రకటించడంతో బ్యాంకింగ్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి.

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 105 పైసలు బలహీనపడటంతో ఎగుమతి ఆధారిత ఐటీ, ఫార్మా కంపెనీల షేర్లకు కలిసొచ్చింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల వృద్ధి అవుట్‌లుక్‌ను ఐఎంఎఫ్‌ మెరుగుపరచడంతో మెటల్‌ షేర్లు మెరిశాయి.  అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 699 పాయింట్లు, నిఫ్టీ 197 పాయింట్లు మేర లాభపడ్డాయి. మిడ్‌ క్యాప్‌ రంగాల షేర్లలో చెప్పుకొదగిన స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.5% ర్యాలీ చేసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 227 కోట్ల పెట్టుబడులు పెట్టగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.318 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.

బార్బెక్యూ నేషన్‌ డిస్కౌంట్‌ లిస్టింగ్‌
రెస్టారెంట్ల నిర్వహణ సంస్థ బార్బెక్యూ నేషన్‌ హాస్పిటాలిటీ షేరు.. ఇష్యూ ధర రూ.500 తో పోలిస్తే బీఎస్‌ఈలో 1.6 శాతం డిస్కౌంట్‌తో రూ.492 వద్ద లిస్ట్‌ అయ్యింది. మార్కెట్‌ ర్యాలీలో భాగంగా వెంటనే రికవరీ అయ్యింది. చివరికి 18 శాతం లాభంతో 590 గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.

రూపాయి 105 పైసలు క్రాష్‌
20 నెలల్లో ఇదే అతిపెద్ద పతనం
ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో బుధవారం రూపాయి విలువ గడిచిన 20 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. డాలర్‌ మారకంలో ఏకంగా 105 పైసలు క్షీణించి 74.47 స్థాయి వద్ద స్థిరపడింది. 2019 ఆగస్ట్‌ 5 తర్వాత ఒక రోజులో ఇంత పెద్ద పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ఉదయం 73.52 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 73.52 – 74.50 పరిధిలో కదలాడింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసులు పెరగడంతో పాటు ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి రెపోరేటును యథాతథంగా కొనసాగించడం కూడా రూపాయి పతనానికి కారణమైనట్లు బీఎన్‌పీ పారీబా విశ్లేషకుడు సైఫ్‌ ముకదం తెలిపారు.  

మరిన్ని వార్తలు