షార్ట్‌ కవరింగ్‌తో నష్టాలకు చెక్‌..

20 Mar, 2021 00:59 IST|Sakshi

ముంబై: షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్ల అండతో సూచీలు శుక్రవారం భారీ లాభాలు అందుకున్నాయి. దీంతో అయిదురోజుల వరుస నష్టాలకు ముగింపు పడినట్లైంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ షేరు మూడున్నర శాతం రాణించడం కూడా సూచీల ర్యాలీకి కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ 642 పాయింట్లు లాభపడి 49,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 14,744 వద్ద నిలిచింది. ఇటీవల మార్కెట్‌ పతనంతో భారీగా కుదేలైన ఎఫ్‌ఎంసీజీ, మెటల్, బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లలో విరివిగా కొనుగోళ్లు జరిగాయి.

కేంద్రం ప్రకటించిన కొత్త స్క్రాపేజ్‌ విధానంతో ఆటో రంగ షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ.., చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఒక్క రియల్టీ రంగ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కదలాడటం, దేశీయంగా కరోనా కేసుల విజృంభణ లాంటి ప్రతికూలాంశాలతో సూచీలు రోజంతా తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1416 పాయిం ట్ల రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ 438 పాయింట్ల పరిధిలో ట్రేడైంది. ఇవే బాండ్‌ ఈల్డ్స్, కరోనా కేసుల పెరుగుదల కారణాలతోనే ఈ వారంలో సెన్సెక్స్‌ 934 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 287 పాయింట్లు నష్టపోయింది.  

మిడ్‌సెషన్‌ నుంచి షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు....  
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో ప్రారం భమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 629 పాయిం ట్లు నష్టపోయి 49,216 వద్ద, నిఫ్టీ 208 పాయింట్లను కోల్పోయి 14,350 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. భారీ నష్టాలను చవిచూస్తున్న సూచీలను మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు ఆదుకున్నాయి. చివర్లో కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం నుంచి 1416 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 438 పాయింట్లు లాభపడింది.  

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
► ఐటీసీ వ్యాపార విభజనపై చర్చించేందుకు బోర్డు ఏప్రిల్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక తెలపడంతో కంపెనీ షేరు 2.5 శాతం లాభపడి రూ.223 వద్ద     ముగిసింది.   
► రిలయన్స్‌ రిటైల్‌ కుదుర్చుకున్న ఒప్పందంపై ముందుకెళ్లందంటూ సింగపూర్‌ ఆర్బిట్రేటర్‌ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ షేరు 10 శాతం నష్టంతో రూ.56 వద్ద స్థిరపడింది.  
► రిలయన్స్‌ షేరు మూడున్నర శాతం లాభంతో రూ.2078 వద్ద నిలిచింది.  
► అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఎయిర్‌టెల్‌కు పాజిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో కంపెనీ షేరు ఒకశాతం లాభంతో రూ.532 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు