53000 శిఖరంపై సెన్సెక్స్‌

8 Jul, 2021 03:25 IST|Sakshi

సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగింపు

నిఫ్టీ లాభం 61 పాయింట్లు 

మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ర్యాలీ

ముంబై: చివరి అరగంటలో మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 194 పాయింట్ల లాభంతో తొలిసారి 53వేల పైన 53,055 వద్ద స్థిరపడింది. ఈ స్థాయి సెన్సెక్స్‌కు సరికొత్త రికార్డు ముగింపు. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 15880 వద్ద నిలిచింది. అయితే రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు సూచీల లాభాలను పరిమితం చేశాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లు రాణించాయి.

భారత తయారీ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో మెటల్‌ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ముందస్తు ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో రియల్టీ షేర్లు రాణించాయి. మరోవైపు ఆటో, మీడియా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ రెండు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ చిన్న, మధ్య తరహా షేర్లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఉదయం సెన్సెక్స్‌ 59 పాయింట్ల లాభంతో 52,920 వద్ద, నిఫ్టీ రెండు పాయింట్ల స్వల్ప లాభంతో 15,820 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఆఖర్లో అనూహ్య కొనుగోళ్లతో సెన్సెక్స్‌ 244 పాయింట్లు ర్యాలీ చేసి 53,105 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 15,894 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.533 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.232 కోట్ల షేర్లను అమ్మారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ ఏడు పైసలు బలహీనపడి 74.62 వద్ద స్థిరపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌ (బుధవారం రాత్రి) వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలైన బాండ్లు, డాలర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


‘‘మిడ్‌సెషన్‌ తర్వాత మెటల్‌ షేర్లు రాణించడంతో మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. దేశీయంగా స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో రానున్న రోజుల్లో సూచీల గమనానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకం కానున్నాయి. మార్కెట్‌ పతనమైతే జాగ్రత్త వహిస్తూ కొనుగోళ్లు చేయడం మంచిందే’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

పరుగులు పెట్టిన పేపర్‌ షేర్లు...  
కొన్నిరోజుల నుంచి స్తబ్ధుగా ట్రేడ్‌ అవుతున్న పేపర్, పేపర్‌ ఉత్పత్తుల షేర్లు ఇంట్రాడేలో పరుగులు పెట్టాయి. స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పేపర్, పేపర్‌ ఉత్పత్తుల డిమాండ్‌ 11–15% వృద్ధి చెందుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. చైనాలో కలప ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ కలప కంపెనీలకు కలిసొస్తుందని నిపుణులు తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► స్టీల్‌ ఉత్పత్తిని తగ్గించాలని చైనా యోచిస్తున్న తరుణంలో స్టీల్‌ షేర్లు రాణించాయి.  
► తొలి క్వార్టర్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రియల్టీ ఎస్టేట్‌ సంస్థ శోభ లిమిటెడ్‌  ప్రకటనతో ఈ కంపెనీ షేరు ఆరు శాతం లాభపడి రూ. 521 వద్ద ముగిసింది.  
►  క్యూ1 అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించినప్పటికీ.., లాభాల స్వీకరణతో టైటాన్‌ షేరు రెండు శాతం నష్టపోయి రూ.1,727 వద్ద స్థిరపడింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు  
► స్టీల్‌ ఉత్పత్తిని తగ్గించాలని చైనా యోచిస్తున్న తరుణంలో స్టీల్‌ షేర్లు రాణించాయి.  
► తొలి క్వార్టర్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రియల్టీ ఎస్టేట్‌ సంస్థ శోభ లిమిటెడ్‌  ప్రకటనతో ఈ కంపెనీ షేరు ఆరు శాతం లాభపడి రూ. 521 వద్ద ముగిసింది.  
► క్యూ1 అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించినప్పటికీ.., లాభాల స్వీకరణతో టైటాన్‌ షేరు రెండు శాతం నష్టపోయి రూ.1,727 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు