కొనసాగుతున్న రికార్డులు..

12 Nov, 2020 05:21 IST|Sakshi

ముంబై: ఫార్మా, మెటల్, ఆటో షేర్ల ర్యాలీతో సూచీలు ఎనిమిదోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 316 పాయింట్లు పెరిగి 43,594 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లను ఆర్జించి 12,749 వద్ద స్థిరపడ్డాయి. దీంతో సూచీల రికార్డుల పర్వం మూడోరోజూ కొనసాగినట్లయింది. దేశంలో పది కీలక రంగాల్లో ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం(పీఎల్‌ఐ)కు ఆమోదం తెలపడంతో సంబంధిత రంగాల్లో విస్తృతంగా కొనుగోళ్లు జరిగాయి. అలాగే ఫైజర్‌ కంపెనీ రూపొందించిన కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ విజయవంతం ఆశలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 431 పాయింట్లు పెరిగి 43, 708 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల  12,770 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి.  

ఇంట్రాడేలో అమ్మకాలు...
లాభాలతో మొదలైన మార్కెట్లో తొలి గంటలో కొనుగోళ్లు కొనసాగాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిచూపారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ట్రేడర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఇంధన, మీడియా రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ ఇంట్రాడే(43,708) నుంచి ఏకంగా 738 పాయింట్ల కోల్పోగా, నిఫ్టీ డే హై నుంచి 200 పాయింట్లు పడింది.  

4 శాతం నష్టపోయిన రిలయన్స్‌...  
ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ షేరు బుధవారం 4 శాతం నష్టపోయి రూ. 1979 వద్ద స్థిరపడింది. ఎమ్‌ఎస్‌సీఐ ఇండెక్స్‌ రివ్యూలో రిలయన్స్‌ షేరుకు వెయిటేజీ తగ్గించడంతో అమ్మకాలు తలెత్తాయి.

గ్లాండ్‌ ఫార్మా ఐపీఓకు 2 రెట్ల స్పందన
హైదరాబాద్‌: గ్లాండ్‌ ఫార్మా ఐపీఓ చివరిరోజు ముగిసేసరికి 2.05 రెట్లు్ల ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. ఇష్యూలో భాగంగా కంపెనీ జారీ చేసిన మొత్తం 3.50 కోట్ల షేర్లకు గానూ 6.21 కోట్ల బిడ్లు ధాఖలయ్యాయి. ఇందులో క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల (క్యూఐబీ) విభాగం 6.40 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల (ఎన్‌ఐఐ)విభాగం 51 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం 24 శాతం సబ్‌స్క్రైబ్‌ అయినట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు తెలిపాయి. రూ.6,480 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చిన ఇష్యూ ఈ నవంబర్‌ 9 న ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు