సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 37,100

28 Sep, 2020 06:29 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

చాలావారాల తర్వాత ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ ఒక్కసారిగా గతవారం కుదుపునకు లోనయ్యాయి.  ఈ కరెక్షన్‌ ప్రభావంతో భవిష్యత్‌ ర్యాలీలో రంగాలవారీగా, షేర్లవారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.  ప్రపంచ స్టాక్‌ సూచీలు కనిష్టస్థాయి నుంచి కోలుకున్నప్పటికీ, వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక భారత్‌ స్టాక్‌ సూచీల స్వల్పకాలిక సాంకేతిక అంశాలకొస్తే....  

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
సెప్టెంబర్‌ 25తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,800 పాయింట్ల వరకూ పతనమై 36,496 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. అటుతర్వాత వేగంగా కోలుకుని, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,457 పాయింట్ల భారీ నష్టంతో 37,389 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌ కు 37,650 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు.  ఈ అవరోధస్థాయిని దాటి, ముగిస్తే 38,140 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన 38,300 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్‌ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా  37,100 పాయింట్ల వద్ద  తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 36,730 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే 36,500 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.

నిఫ్టీ తక్షణ అవరోధం 11,120
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,790 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. అటుతర్వాత కోలుకుని చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 455 పాయింట్ల నష్టంతో11,050 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 11,120 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,260 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే 11,310 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. ఈ వారం నిఫ్టీ 11,080 పాయింట్ల దిగువన ట్రేడవుతూ వుంటే 10,980 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే   10,860 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 10,790 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు.

– పి. సత్యప్రసాద్‌

మరిన్ని వార్తలు