న‌ష్టాలే.. సెన్సెక్స్ 337 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ 17వేల మార్క్‌కు ప‌రిమితం

15 Mar, 2023 07:21 IST|Sakshi

ముంబై: అమెరికా బ్యాంకింగ్‌ సంక్షోభ ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లను వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు కొద్దిసేపటికి నష్టాల్లోకి మళ్లాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్‌ షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో 571 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌ చివరికి 338 పాయింట్ల పతనంతో 57,900 వద్ద స్థిరపడింది. ఒక దశలో నిఫ్టీ 17వేల స్థాయిని కోల్పోయింది. ఆఖరికి 111 పాయింట్లు నష్టపోయి 17,043 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు అయిదు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3087 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2122 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 14 పైసలు క్షీణించి రూ.82.37 వద్ద స్థిరపడింది. యూఎస్‌ సూచీల భారీ పతనం నేపథ్యంలో ఆసియా–పసిఫిక్‌ మార్కెట్లు నష్టాల్లో, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ‘‘బేర్స్‌ ఆధిపత్యం నాలుగోరోజూ కొనసాగింది. కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధాన వైఖరి, ద్రవ్యోల్బణం కారణంగా బాండ్లపై దిగుమతులు తగ్గేందుకు మరింత సమయం పడుతుంది. ఒక దశలో నిఫ్టీ ఆరంభ నష్టాలను భర్తీ చేసుకునేందుకు యతి్నంచింది. అయితే ఐటీ, బ్యాంకింగ్, ఇంధన షేర్లలో తలెత్తిన అమ్మకాలతో తేరుకోలేకపోయింది. యూఎస్‌ ద్రవ్యోల్బణ డేటా (మంగళవారం వెల్లడి) నేటి ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపనుంది. ట్రేడర్లు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై మరింత దృష్టి సారించాలి’’ జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

మార్కెట్లో మరిన్ని సంగతులు...
► ఆటో ఉపకరణాల తయారీ సంస్థ దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్స్‌ లిస్టింగ్‌ మెప్పించింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.590)తో పోలిస్తే ఐదుశాతం ప్రీమియంతో రూ.620 వద్ద లిస్టయ్యింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి రెండున్నరశాతం లాభంతో రూ.605 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 34.14 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,851 కోట్లుగా నమోదైంది.  

► హిందుస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(హెచ్‌సీసీ) షేరు 4% లాభపడి రూ.15 వద్ద స్థిరపడింది. మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌తో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌.. నేషనల్‌ హై–స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుండి భారీ ఆర్డర్‌ దక్కించుకుంది.

మరిన్ని వార్తలు