రికార్డుల ర్యాలీకి బ్రేక్‌..!

11 Dec, 2020 06:32 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు 

46 వేల దిగువకు సెన్సెక్స్‌ 

నిఫ్టీ నష్టం 51 పాయింట్లు

ముంబై: మార్కెట్లో వరుస రికార్డుల ర్యాలీకి గురువారం విరామం పడింది. బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక, ఆటో రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల ఏడురోజుల సుదీర్ఘ ర్యాలీ ఆగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, డాలర్‌ మారకంలో నీరసించి రూపాయి విలువ వంటి అంశాలు ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 144 పాయింట్లు నష్టపోయి 45,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్లను కోల్పోయి 13,478 వద్ద నిలిచింది. మార్కెట్‌ పతనంలోనూ ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఎదురీదాయి. 

మెటల్, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 418 పాయింట్ల వరకు నష్టపోయి 45,686 స్థాయి వద్ద, నిఫ్టీ 130 పాయింట్లను కోల్పోయి 13,399 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ఇటీవల జరిగిన బుల్‌ ర్యాలీలో భారీగా లాభపడిన బ్యాంకింగ్, చిన్న, మధ్య తరహా షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ జరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ గరిష్టస్థాయిల వద్దే సూచీలు ట్రేడ్‌ అవుతున్న తరుణంలో జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏదైనా ప్రతికూల సంఘటన జరిగితే లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉందని వారంటున్నారు. వరుసగా రెండురోజులు లాభపడిన రూపాయి గురువారం 9 పైసలు నష్టపోయి 73.66 వద్ద స్థిరపడింది.

సిమెంట్‌ షేర్లకు సీఐఐ షాక్‌...  
కాంపిటీటివ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పలు సిమెంట్‌ కంపెనీలపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో గురువారం ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంబుజా సిమెంట్స్‌ 2 శాతం నష్టంతో రూ.248 వద్ద, ఏసీసీ 1.50 శాతంతో 1,632 వద్ద ముగిశాయి.  

ఆగని ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం...
దేశీ ఈక్విటీల్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. నగదు విభాగంలో గురువారం రూ.2260 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.

ఈ నెల 15 నుంచి మిసెస్‌ బెక్టర్స్‌ ఫుడ్‌ ఐపీఓ
బ్రెడ్డు, బిస్కెట్లు తయారు చేసే మిసెస్‌ బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాల్టీస్‌ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 15 నుంచి ప్రారంభం కానున్నది. రూ. 10 ముఖ విలువ గల ఈక్విటీ షేర్‌కు ధరల శ్రేణి (ప్రైస్‌బాండ్‌)ని రూ.286–288గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 17న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 28న ఈ   షేర్లు లిస్టవుతాయి.  ఐపీఓలో రూ. 40.54 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు.

మరిన్ని వార్తలు