చివర్లో అమ్మకాలు

8 Jan, 2021 06:08 IST|Sakshi

రెండోరోజూ నష్టాల ముగింపే

81 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్‌

14100 స్థాయిని నిలుపుకున్న నిఫ్టీ  

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో విక్రయాలు 

మెరిసిన మెటల్‌ షేర్లు

ముంబై: చివరిగంట అమ్మకాలతో స్టాక్‌ మార్కెట్‌ రెండోరోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 81 పాయింట్లను కోల్పోయి 48,093 వద్ద సిర్థపడింది. నిఫ్టీ 9 పాయింట్లను కోల్పోయి 14,137 వద్ద నిలిచింది. నిఫ్టీ వీఎఫ్‌ఎక్స్‌ ఇండెక్స్‌ 2 శాతం పెరిగింది. ఇది మార్కెట్లో అస్థిరతను సూచిస్తుంది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో విక్రయాలు తలెత్తడంతో సూచీలు ఉదయం లాభాలన్నీ హరించుకుపోయాయి. మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక, రియల్టీ రంగాలకు చెందిన చిన్న, మధ్యతరహా షేర్లు అద్భుతమైన ర్యాలీని జరిపాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 520 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 133 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఐటీ కంపెనీ టీసీఎస్‌ క్యూ3 ఫలితాల ప్రకటనతో నేటి(జనవరి 8)నుంచి కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ ప్రారంభం కానుంది. అలాగే కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో 2021–22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

ఈ రెండు అంశాలే రానున్న రోజుల్లో మార్కెట్‌కు కీలకమని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలు వ్యవస్థలో రికవరీకి సూచిస్తుండంతో పాటు కంపెనీల మూడో క్వార్టర్‌ ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చనే అంచనాలతో మధ్యకాలానికి మార్కెట్‌ పరిమిత శ్రేణిలో కదలాడవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని జార్జియా రాష్ట్ర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థుల గెలుపు ఖరారు కావడంతో ఈ పార్టీకి యూఎస్‌ పార్లమెంట్‌లో ఇరు సభల్లో సంపూర్ణ ఆధిక్యం లభించినట్లైంది. ఆర్థిక ఉద్దీపన చర్యలకు అధిక ప్రాధాన్యత నిచ్చే జో బైడెన్‌ విజయంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఇక నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.382 విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. డీఐఐలు రూ.989 పెట్టుబడులను వెనక్కి తీశారు.

మరింత పెరిగిన ఇన్వెస్టర్ల సంపద...  
బెంచ్‌ మార్క్‌ సూచీలు స్వల నష్టాలతో ముగిసినప్పటికీ.., మార్కెట్లో భారీగా విస్తృత స్థాయి కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గురువారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.193 లక్షల కోట్ల(2.6 డాలర్లు)కు చేరుకుంది. ఈ మొత్తంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.12.11 లక్షల కోట్లుగా, టీసీఎస్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.11.37 లక్షల కోట్లుగానూ ఉంది.  

>
మరిన్ని వార్తలు