ముహురత్‌ ట్రేడింగ్‌లో షేర్లు కొనుగోలు చేస్తే లాభాల పంట..!

4 Nov, 2021 00:37 IST|Sakshi

బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు  

ఆరంభ లాభాలు ఆవిరి  

మళ్లీ 60 వేల దిగువకు సెన్సెక్స్‌ 

నిఫ్టీ నష్టం 60 పాయింట్లు 

నేడు ముహురత్‌ ప్రత్యేక ట్రేడింగ్‌  

బలిప్రతిపదా సందర్భంగా శుక్రవారం సెలవు

ముంబై: ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ ప్రకటనకు ముందు మంగవారం స్టాక్‌ మార్కెట్లో అప్రమత్తత చోటుచేసుకుంది. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో తలెత్తడంతో సెన్సెక్స్‌ 257 పాయింట్లు కోల్పోయి 59,772 వద్ద ముగిసింది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 17,829 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు. మెటల్, రియల్టీ, మౌలిక రంగాల షేర్లు రాణించాయి. సెన్సెక్స్‌ ఉదయం 246 పాయింట్ల లాభంతో 60,275 వద్ద మొదలైంది.

భారత సేవల రంగం అక్టోబర్‌లో మెరుగైన వృద్ధిని కనబరచడంతో తొలి సెషన్‌లో కొనుగోళ్లు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 333 పాయింట్లు ర్యాలీ చేసి 60,362 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 100 వరకు పెరిగి 17,989 వద్ద ఇంట్రాడే హైని తాకింది. అయితే మిడ్‌సెషన్‌లో యూరప్‌ మార్కెట్ల బలహీన ప్రారంభంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడమే కాకుండా నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్‌ ముగిసే వరకు విక్రయాలకే కట్టుబడటంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.401 కోట్ల షేర్లను అమ్మగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.195 కోట్ల షేర్లను కొన్నారు.  

‘‘ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ కమిటీ నిర్ణయాల కోసం ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. అయితే ఫెడ్‌ ట్యాప్‌రింగ్, వృద్ధి, ద్రవ్యోల్బణ అంశాలపై ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ చేసే వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్ల గమనాన్ని నిర్ధేశిస్తాయి’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ సంస్థ వైస్‌ చైర్మన్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. 

దీపావళి సందర్భంగా నేడు ముహురత్‌ ప్రత్యేక ట్రేడింగ్‌ 
దీపావళి సందర్భంగా నేడు స్టాక్‌ ఎక్స్‌చేంజీలకు సెలవు రోజు అయినప్పటికీ.., సాయంత్రం ప్రత్యేకంగా గంటసేపు ముహూరత్‌ ట్రేడింగ్‌ జరుగుతుంది. ట్రేడింగ్‌ సాయంత్రం 6.15 నుంచి 7.15 మధ్య జరుగుతుంది. ఎక్చ్సేంజీల సమయ పాలన మినహా ట్రేడింగ్‌ విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ప్రత్యేక మూహురత్‌ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసిన షేర్లు వచ్చే ఏడాది వరకు లాభాల పంట పండిస్తాయని ట్రేడర్లు విశ్వసిస్తారు.  

శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు ...  
బలిప్రతిపదా సందర్భంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. స్టాక్‌ ఎక్స్‌చేంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు కూడా పని చేయవు. శని ఆదివారాలు సాధారణ సెలవు రోజులు. సోమవారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభవుతాయి. 

మార్కెట్లో మరిన్ని సంగతులు.. 

  • సెప్టెంబర్‌ క్వార్టర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో ట్రెంట్‌ షేరు ఐదుశాతం లాభంతో రూ.1093 వద్ద స్థిరపడింది. 
  • నిధుల సమీకరణ ప్రణాళికకు బోర్డు ఆమోదంతో శోభ లిమిటెడ్‌ షేరు 10% పెరిగి రూ.952 వద్ద ముగిసింది.  
  • భారీ సంఖ్యలో ఆర్డర్లు రావచ్చనే అంచనాలతో ఎల్‌అండ్‌టీ షేరు 4% పెరిగి రూ.1889 నిలిచింది.  
  • మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించిన రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో ఎస్‌బీఐ షేరు ఇంట్రాడేలో 4% ఎగసి రూ.542 స్థాయికి చేరింది. చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో ఒకశాతం స్వల్ప లాభంతో రూ.528 వద్ద ముగిసింది. 
మరిన్ని వార్తలు