స్టాక్​ మార్కెట్లపై బేర్ పంజా.. కుప్పకూలిన సూచీలు!

15 Mar, 2022 16:14 IST|Sakshi

స్టాక్​ మార్కెట్లపై బేర్ పంజా విసరడంతో సూచీలు నేడు భారీగా నష్టపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత హెవీ వెయిట్ షేర్ల పతనంతో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీన పవనాలు, ఆసియా మార్కెట్లు డీలా పడటం వంటి కారణాలతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనమైంది. అలాగే, వరుసగా 5 సెషన్లు లాభాలతో ముగియడంతో మదుపరులు తమ లాభాలను వెనక్కి తీసుకున్నారు. ముగింపులో, సెన్సెక్స్ 709.17 పాయింట్లు(1.26%) క్షీణించి 55,776.85 వద్ద ఉంటే, నిఫ్టీ 208.30 పాయింట్లు(1.23%) క్షీణించి 16,663 వద్ద స్థిరపడింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్​బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సంస్థ షేరు భారీగా పతనమవుతోంది. బీఎస్​ఈలో మార్చి 14న 13 శాతం వరకు క్షీణించిన పేటీఎం.. నేడు మరో 12.74 శాతం పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలోనే షేరు ఇష్యూ ధరలో 69 శాతం విలువ పడిపోయింది. 2021 నవంబరులో పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినప్పుడు ఇష్యూ ధర రూ.2,150 కాగా.. నేడు ట్రేడింగ్‌ ముగిసేనాటికి రూ.589.30కి దిగివచ్చింది.

డాలరుతో రూపాయి మారకం విలువ నేడు రూ.76.53 వద్ద ఉంది. 30 షేర్ల ఇండెక్స్​లో టాటా స్టీల్, టెక్ మహీంద్ర, హెచ్​సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, ఎమ్ & ఎమ్, సిప్లా, శ్రీ సిమెంట్స్, మారుతి సుజుకి షేర్లు రాణించాయి. ఆటో మినహా ఇతర అన్ని సెక్టార్ సూచీలు(ఐటి, మెటల్, పవర్ ఆయిల్ & గ్యాస్) 1-4 శాతం నష్టపోవడంతో మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం నష్టపోయాయి.

(చదవండి: ఆ రెండు నగరాల మధ్య.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే!)

మరిన్ని వార్తలు