మళ్లీ 59 వేల పైకి సెన్సెక్స్‌!

12 Aug, 2022 07:09 IST|Sakshi

ముంబై: ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు గురువారం ఒక శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 515 పాయింట్లు పెరిగి 59,333 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8 తర్వాత ఈ సూచీ 59 వేల స్థాయిపై ముగియడం ఇదే తొలిసారి. నిఫ్టీ 124 పాయింట్లు బలపడి 17,659 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం భారీ లాభంతో మొదలైంది. 

సెన్సెక్స్‌ 503 పాయింట్లు పెరిగి 59,320 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 17,711 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో కొంత మేర లాభాలు తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆటో, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,298 కోట్ల షేర్లను కొనడంతో పదోరోజూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.730 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో జపాన్, యూరప్‌లో బ్రిటన్‌ మినహా అన్ని దేశాల స్టాక్‌ సూచీలు లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. 

లాభాలు ఎందుకంటే... 
అమెరికా జూలై ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే తక్కువగానే నమోదయ్యాయి. దీంతో యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వచ్చే సమీక్షా సమావేశాల్లో కఠినతర ద్రవ్య పాలసీ వైఖరికి స్వస్తి పలుకుతూ.., వడ్డీరేట్లపై దూకుడు విధానాన్ని ప్రదర్శించకపోవచ్చనే ఆశావహ అంచనాలు మార్కెట్‌ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు తగ్గడం, క్రూడ్‌ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు  పదోరోజూ దేశీయ ఈక్విటీలను కొనేందుకు మొగ్గుచూపడం తదితర అంశాలను నుంచీ సానుకూల సంకేతాలను అందాయి. 

మార్కెట్‌లో మరిన్ని సంగతులు 
బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంకు రెండుశాతం పెరిగి రూ.866 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారి రూ. 6 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్‌ ముగిసే సరికి షేరు 1.5% లాభంతో రూ.859 వద్ద ముగిసింది.   

జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు మెప్పించడంతో కోల్‌ ఇండియా షేరు ఇంట్రాడేలో మూడుశాతం లాభపడి రూ.226 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. అనంతరం లాభాల స్వీకరణతో చివరికి అరశాతం స్వల్ప లాభపడి రూ.219 వద్ద స్థిరపడింది.  

కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌ (క్యూ1)లో నికర లాభం రెండు రెట్లు వృద్ధి చెందడంతో  ఐషర్‌ మోటార్స్‌ షేరు 3% పైగా రాణించి రూ.3261 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి అర శాతం లాభంతో రూ.3,175 వద్ద నిలిచింది. 

రూపాయి బలహీన ధోరణి... 
డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ధోరణిని ప్రతిబింబిస్తూ గురువారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో దేశీయ కరెన్సీ 37 పైసలు నష్టపోయి 79.62 వద్ద ముగిసింది. దేశంలోకి క్యాపిటల్‌ఇన్‌ఫ్లోస్, ఈక్విటీ మార్కెట్ల సానుకూలతలు ఉన్నా రూపాయి బలహీనపడ్డం గమనార్హం.

మరిన్ని వార్తలు