మళ్లీ బుల్‌ పరుగులు

3 Sep, 2021 02:28 IST|Sakshi

17200 పైకి నిఫ్టీ 

సెన్సెక్స్‌ లాభం 514 పాయింట్లు

సరికొత్త గరిష్టాల వద్ద ముగింపు

సూచీల ర్యాలీకి లార్జ్‌క్యాప్‌ షేర్ల తోడ్పాటు

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ

ముంబై: ఒకరోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్‌ సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ బ్యాంక్స్‌ షేర్లలో చెప్పుకోదగ్గ కొనుగోళ్లు జరిగాయి. లార్జ్‌క్యాప్‌ షేర్లైన టీసీఎస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు మూడు శాతం వరకు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 514 పాయింట్లు ఎగసి 57,853 వద్ద ముగిసింది. ఒక దశలో 554 పాయింట్ల వరకు ర్యాలీ చేసి 57,892 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 17,234 వద్ద నిలిచింది.

ఇంట్రాడేలో నిఫ్టీ 169 పాయింట్లు ర్యాలీ చేసి 17,246 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఆల్‌టైం హై ముగింపులు కావడం విశేషం. అంతకు ముందు(బుధవారం) ట్రేడింగ్‌లో పతనమైన షేర్లకు అధిక డిమాండ్‌ నెలకొంది. సూచీలు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలైన ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ షేర్లను కొనేందుకు అధికాసక్తి చూపారు. సెమికండక్టర్‌ కొరతతో ఆగస్టు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటో రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.349 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.382 కోట్ల ఈక్విటీలను కొన్నారు. ఫారెక్స్‌ మార్కెట్లోనూ రూపాయి 2 పైసలు బలపడి 73.06 వద్ద స్థిరపడింది. అమెరికా ఉద్యోగ గణాంకాల విడుదలకు ముందు అప్రమత్తతతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. బుల్‌ జోరుతో ఇన్వెస్టర్లకు రూ.2.5 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.252.66 లక్షల కోట్లకు చేరింది.  

‘‘జీడీపీతో సహా ఇటీవల విడుదలైన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించగలిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందనే ఆశావాదంతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీయ ఈక్విటీ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 17100 కీలక నిరోధాన్ని ఛేదించిన తర్వాత మరింత దూసుకెళ్లింది. ప్రస్తుత ట్రేడింగ్‌ స్థాయి(17200–17250)ని నిలుపుకోగలిగితే మూమెంటమ్‌ కొనసాగి 17,400 – 17450 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని ఆనంద్‌ రాఠి ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ నరేందర్‌ సోలంకీ తెలిపారు.

మార్కెట్‌లో మరిన్ని విశేషాలు
► నిధుల సమీకరణ అంశంపై బోర్డు సమావేశాని(శుక్రవారం)కి ముందు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేరు ఎనిమిది శాతం ఎగసి రూ.776 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 6% లాభంతో రూ.759 వద్ద ముగిసింది.   
► మధ్యంతర డివిడెండ్‌ ప్రకటన తర్వాత వేదాంత షేరుకు డిమాండ్‌ నెలకొంది. మూడు శాతం ర్యాలీ చేసి రూ. 306 వద్ద స్థిరపడింది.
► కెనడా దేశంలోని స్థానిక ఫార్మా మార్కెట్లోకి రెవెలిమిడ్‌ జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేయడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేరు రెండు శాతం లాభపడి రూ.4,857 వద్ద నిలిచింది.  
► రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వడంతో కైటెక్స్‌ గార్మెంట్స్‌ షేరు పదిశాతం లాభంతో రూ.164 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు