ముచ్చటగా మూడోరోజు...నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!

7 Apr, 2022 16:19 IST|Sakshi

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య విధానాలు కఠినంగా ఉంటాయనే వార్తలు ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. అంతేకాకుండా  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వైమాసిక పాలసీ ఫలితాలను శుక్రవారం రోజున ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి అడుగులు వేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు తోడవడంతో దేశీయ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్ 575 పాయింట్లు లేదా 0.97 శాతం క్షీణించి 59,035 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 168 పాయింట్లు లేదా 0.94 శాతం క్షీణించి 17,640 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.02 శాతం, స్మాల్ క్యాప్ 0.31 శాతం క్షీణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 

యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, డాక్టర్‌ రెడ్డీస్, టెక్ మహీంద్రా స్టాక్స్‌ లాభాల్లో ముగిశాయి. టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్), టిసిఎస్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టి, అదానీ పోర్ట్స్‌ నష్టాలను మూటగట్టుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. 

చదవండి: తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు.. రూ.1000 కోట్ల పెట్టుబడులు

మరిన్ని వార్తలు