అమ్మకాల సునామీ -కుప్పకూలిన మార్కెట్

24 Sep, 2020 16:05 IST|Sakshi

మార్కెట్ల పతనానికి పలు కారణాలు

1,115 పాయింట్ల పతనం- 36,553కు సెన్సెక్స్‌

326 పాయింట్లు కోల్పోయి 10,806 వద్ద ముగిసిన నిఫ్టీ

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2.2 శాతం మైనస్‌

ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలన్నీ 4-3 శాతం మధ్య డౌన్‌

ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు సైతం షాక్‌ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 1,115 పాయింట్లు పడిపోయింది. ఫలితంగా 37,000 పాయింట్ల మార్క్‌ను సైతం కోల్పోయి 36,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 326 పాయింట్లు పతనమై 10,806 వద్ద నిలిచింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల స్థాయికి నీళ్లొదులుకుంది.  వెరసి మార్కెట్లు ఇంట్రాడే కనిష్టాల సమీపంలో ముగియడం గమనార్హం!

ఏం జరిగిందంటే?
కోవిడ్‌-19 కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతున్నదని, దీంతో ప్రభుత్వం మరింత అధికంగా ఆర్థిక మద్దతును అందించవలసి ఉన్నదని ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తాజాగా స్పష్టం చేశారు. అయితే వైట్‌హౌస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో డెమక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలింది. మరోపక్క సెకండ్‌ వేవ్‌లో భాగంగా కోవిడ్‌-19 చెలరేగుతుండటంతో పలు యూరోపియన్‌ దేశాలు తాజాగా లాక్‌డవున్‌లకు తెరతీశాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత మాంద్యంలోకి నెట్టివేయవచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇటీవల పాలసీ సమీక్షను చేపట్టిన ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలో కొనసాగించేందుకు కట్టుబడుతున్నట్లు ప్రకటించినప్పటికీ మరో ప్యాకేజీపై ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం! ఇలాంటి పలు ప్రతికూల అంశాలతోపాటు.. కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న యూఎస్ టెక్నాలజీ కౌంటర్లలో ఇటీవల భారీ అమ్మకాలు నమోదవుతుండటం.. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు దారితీసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా చైనాతో సైనిక వివాదాలు సైతం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు.

అన్నిటా నష్టాలే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. మెటల్‌, మీడియా, ఐటీ, బ్యాంకింగ్‌, ఆటో, ఫార్మా, రియల్టీ 4-3 శాతం మధ్య క్షీణించాయంటే అమ్మకాల తీవ్రతనుఅర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌(3 శాతం), జీ(1 శాతం), హెచ్‌యూఎల్‌(0.25 శాతం) మాత్రమే లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, టీసీఎస్‌, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, ఐవోసీ, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌, ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా, సిప్లా, యాక్సిస్‌ 7.5-4 శాతం మధ్య పతనమయ్యాయి.

ఫైనాన్స్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌, అశోక్‌ లేలాండ్‌, ఇండిగో, శ్రీరామ్‌ ట్రాన్స్‌, జిందాల్‌ స్టీల్‌, కెనరా బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఆర్‌బీఎల్‌, టాటా పవర్‌, ఎన్‌ఎండీసీ, ఫెడరల్‌ బ్యాంక్‌, అంబుజా, సెయిల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, నాల్కో, మదర్‌సన్‌, భెల్‌  9-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. అపోలో హాస్పిటల్స్‌ 7.3 శాతం జంప్‌చేయగా.. గోద్రెజ్‌ సీపీ, కాల్గేట్‌, వేదాంతా, మారికో, చోళమండలం మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2.2 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన షేర్లలో 2,026 నష్టపోగా.. 624 మాత్రమే లాభాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,629 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,073 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 879 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.   

మరిన్ని వార్తలు