మార్కెట్లో మాంద్యం భయాలు

17 Sep, 2022 03:55 IST|Sakshi

బేర్‌మన్న దలాల్‌స్ట్రీట్‌  

సెన్సెక్స్‌ 1,093 పాయింట్లు క్రాష్‌

నిఫ్టీ నష్టం 347 పాయింట్లు

రూ.ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరి  

ముంబై: ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చనే భయాలతో శుక్రవారం దలాల్‌ స్ట్రీట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో స్టాక్‌ సూచీలు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్‌ 1,093 పాయింట్లు క్షీణించి 58,840 వద్ద ముగిసింది. ఈ సూచీలో మొత్తం నాలుగు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 347 పాయింట్లను కోల్పోయి 17,531 వద్ద నిలిచింది.

నిఫ్టీ 50 షేర్లలో సిప్లా, ఇండస్‌ ఇండ్‌ షేర్లు మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ మూడు శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ రెండుశాతం చొప్పున క్షీణించాయి.   ట్రెజరీ బాండ్లపై రాబడులు, డాలర్‌ ఇండెక్స్‌ పెరగడంతో పెరుగుదలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో సూచీలు ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్‌ 952 పాయింట్లు, నిఫ్టీ 303 పాయింట్లను కోల్పోయాయి.

ట్రేడింగ్‌ ఆద్యంత అమ్మకాలే...
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 349 పాయింట్లు పతనమై 59,585 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు క్షీణించి 17,797 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ఆద్యంతం అమ్మకాలకే మొగ్గుచూపారు. ఒక దశలో సెన్సెక్స్‌ 1247 పాయింట్లను కోల్పోయి 58,687 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 17,497 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి.   కాగా, సెన్సెక్స్‌ భారీ నష్టంతో శుక్రవారం ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.6.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇదే సూచీ గడిచిన మూడు రోజుల్లో 1,730 పాయింట్లను కోల్పోవడంతో మొత్తం రూ.7 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.285.90 లక్షల కోట్ల నుంచి రూ.279.80 లక్షల కోట్లకు
దిగివచ్చింది.  

నష్టాలు ఎందుకంటే
అంతర్జాతీయంగా మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ హెచ్చరించడంతో భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధాన అమలుకు సిద్ధమతున్న వేళ.., వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక మాంద్యం ముంచుకురావచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దేశీయంగా ఆగస్టులో ద్రవ్యోల్బణం మళ్లీ  ఎగువబాట పట్టడం ఆందోళన
కలిగించింది

మరిన్ని వార్తలు