మార్కెట్లకు బ్లూచిప్స్‌ దెబ్బ!

13 Jul, 2022 07:20 IST|Sakshi

రెండో రోజూ నేలచూపు సెన్సెక్స్‌ 509 పాయింట్లు డౌన్‌ ఇంట్రాడేలో 54,000 దిగువకు నిఫ్టీ 158 పాయింట్లు పతనం ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ డీలా

ముంబై: ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలు, రెండు దశాబ్దాల గరిష్టానికి చేరిన డాలర్‌ ఇండెక్స్‌ దెబ్బకు సరికొత్త కనిష్టాలను తాకుతున్న రూపాయి దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. దీనికితోడు సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌ ఫలితాల తదుపరి ఐటీ కౌంటర్లలో ఊపందుకున్న అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరిచాయి. వెరసి వరుసగా రెండో రోజు ఇండెక్సులు నష్టాలతో ప్రారంభమై చివరికి పతనమయ్యాయి.

సెన్సెక్స్‌ 509 పాయింట్లు క్షీణించి 53,887 వద్ద ముగిసింది. నిఫ్టీ 158 పాయింట్లు కోల్పోయి 16,058 వద్ద స్థిరపడింది. ప్రధానంగా మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 54,000 పాయింట్ల దిగువన 53,825ను తాకింది. నిఫ్టీ కనిష్టంగా 16,031కు చేరింది.  

ఎన్‌టీపీసీ ఓకే..: ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ(0.1%) మినహా అన్ని రంగాలూ డీలాపడ్డాయి. ఆటో, ఐటీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ 1 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, హిందాల్కో, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, గ్రాసిమ్, టామో, నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్, బ్రిటానియా, యూపీఎల్, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్, కొటక్, ఏషియన్‌ పెయింట్స్, టైటన్, ఐసీఐసీఐ, మారుతీ 3.3–1.3 శాతం నష్టపోయాయి. ఎన్‌టీపీసీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.4 శాతం బలపడింది. ప్రపంచ ఆర్థిక మందగమనం, కేంద్ర బ్యాంకుల కఠిన విధానాల ప్రభావంతో గ్లోబల్‌ మార్కెట్లలోనూ సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79.6ను తాకడం దీనికి జత కలసినట్లు చెప్పారు. 

చిన్న షేర్లు వీక్‌..: మార్కెట్ల బాటలో చిన్న, మధ్యతరహా కౌంటర్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,871 నష్టపోగా.. 1,436 లాభపడ్డాయి.  

ఎఫ్‌పీఐల వెనకడుగు 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐపీలు) మంగళవారం రూ. 1,566 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) స్వల్పంగా రూ. 141 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. 

స్టాక్‌ హైలైట్స్‌ 
 గత 8 రోజులుగా ర్యాలీ బాటలో ఉన్న మహీంద్రా ఫైనాన్షియల్‌ ఇంట్రాడేలో రూ. 207 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. 8 రోజుల్లో 18 శాతం లాభపడింది.  

భారీ ఆర్డర్‌బుక్‌ నేపథ్యంలో టిటాగఢ్‌ వేగన్స్‌ రూ. 128 వద్ద 4ఏళ్ల గరిష్టానికి చేరింది. చివరికి 3.6 శాతం నష్టంతో రూ. 120 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు