ఓపెన్‌ మార్కెట్‌లో కోవిషీల్డ్‌ బూస్టర్‌ డోస్‌.. ధర ఎంతంటే ?

8 Apr, 2022 21:00 IST|Sakshi


కరోనా తీవ్రత తగ్గి జనజీవతం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.అయితే ఇప్పటికీ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో 18 ఏళ్లు పైబడి ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు బూస్టర్‌ డోసు వేసుకోవడం మంచిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో బూస్టర్‌ డోస్‌ను ఓపెన్‌ మార్కెట్‌లో అందిస్తున్నట్టు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.

దేశంలోనే తొలి కరోనా టీకా కోవిషీల్డ్‌ని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేసింది. మొదటి రెండు డోసులు దాదాపుగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించింది. కాగా బూస్టర్‌ డోసును ప్రభుత్వ ఆధ్వర్యంతో ఓమిక్రాన్‌ నేపథ్యంలో ప్రభుత్వం అందించింది. కాగా ఇప్పుడు బూస్టర్‌ డోసును ఓపెన్‌ మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో బయట మార్కెట్‌లో కోవిషీల్డ్‌ బూస్టర్‌ డోసుకు రూ. 600లుగా సీరమ్‌ నిర్ణయించింది. దీనికి స్థానిక పన్నులు అదనం అని సీరమ్‌ స్పష్టం చేసింది.

వ్యక్తిగతంగా కొనుగోలుకు రూ. 600 ధర వర్తిస్తుందని, ఆస్పత్రులకు తక్కువ ధరకే సరఫరా చేస్తామని కూడా తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ 2022 ఏప్రిల్‌ 10 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసును ప్రభుత్వం ఉచితంగా అందివ్వనుంది.
 

చదవండి: గుడ్‌ న్యూస్‌: బహిరంగ మార్కెట్లో విక్రయానికి 2 వ్యాక్సిన్లకు అనుమతి

మరిన్ని వార్తలు