కరోనా వ్యాక్సిన్‌: సీరం సీఈఓ కీలక ప్రకటన

30 Jan, 2021 14:59 IST|Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌‌ పంపిణీ కొనసాగుతున్న వేళ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ ఆదార్‌ పూణావాల మరో కీలక ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్‌ భాగస్వామ్యంతో రూపొందిస్తున్న కోవోవాక్స్‌ మంచి ఫలితాలనిస్తోందని పేర్కొన్నారు. యూకే కోవిడ్‌-19 స్ట్రెయిన్‌పై నోవోవాక్స్‌ 89.3 శాతం ప్రభావంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే జూన్‌ నాటికి కోవోవాక్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పూణావాలా తెలిపారు.(చదవండి: వ్యాక్సిన్‌లో భారత్‌ రికార్డ్‌: ప్రపంచంలోనే తొలిస్థానం

ఈ మేరకు.. ‘‘కోవిడ్‌-19 టీకా తయారీలో నోవోవాక్స్‌తో కలిసి పనిచేస్తున్న క్రమంలో మెరుగైన ఫలితాలు పొందాం. భారత్‌లో కూడా ఇందుకు సంబంధించి ట్రయల్స్‌ మొదలుపెడతాం. జూన్‌ 2021 నాటికి కోవోవాక్స్‌ను లాంచ్‌ చేస్తాం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థగా పేరొందిన సీరం, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో ఇప్పటికే 'కోవిషీల్డ్‌' రూపొందించిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ డోసులను ఇప్పటికే దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. విదేశాలకు సైతం భారత్‌ కోవిషీల్డ్‌ డోసులు ఎగుమతి చేస్తోంది. 

కాగా అమెరికాకు చెందిన నోవావాక్స్‌ను 15 వేల మందికి పైగా వాలంటీర్లపై ప్రయోగించగా, వారిలో 89.3 శాతం మందిలో కరోనాను తట్టుకునే యాంటీబాడీలు తయారయ్యాయి. ఇక 85.6 మందిలో కొత్త స్ట్రెయిన్‌కు కూడా తట్టుకోగల సామర్థ్యం వచ్చిందని సంస్థ ప్రకటించింది. అంతేగాక దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్‌పై సైతం 60 శాతం ప్రభావం చూపిందని తెలిపింది. ఈ స్ట్రెయిన్‌పై ఏ వ్యాక్సిన్‌ పని చేయబోదన్న వార్తల నేపథ్యంలో నోవావాక్స్‌ కొంతమేర అడ్డుకట్ట వేయడం ఊరట కలిగించే అంశంగా పరిణమించింది.

మరిన్ని వార్తలు