దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి

7 Dec, 2020 10:32 IST|Sakshi

ఎమర్జెన్సీ వినియోగానికి దరఖాస్తు చేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్

‌ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కోసం డీజీసీఐకు అప్లై చేసిన తొలి దేశీ కంపెనీ

మూడో దశ క్లినికల్‌ పరీక్షల ప్రాథమిక డేటా ఆధారంగా దరఖాస్తు

న్యూఢిల్లీ, సాక్షి: కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా డీసీజీఐకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా కోవిడ్‌-19 కట్టడికి దేశీయంగా ఒక వ్యాక్సిన్‌ వినియోగం కోసం డీజీసీఐకు దరఖాస్తు చేసిన తొలి దేశీ కంపెనీగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిలిచినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఐసీఎంఆర్‌ సహకారంతో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశీయంగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలను చేపట్టిన విషయం విదితమే. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై మరోపక్క యూకే, బ్రెజిల్‌లోనూ తుది దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 

డేటా ఇలా
ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌పై చేపట్టిన క్లినికల్‌ పరీక్షల తొలి దశ డేటా ఆధారంగా వ్యాక్సిన్‌ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డీజీసీఐకు దరఖాస్తు చేసిన సందర్భంగా పేర్కొంది. ప్రధానంగా కరోనా వైనస్‌ సోకి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో కోవిషీల్డ్‌ మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు సీరమ్‌ తెలియజేసింది. యూకే నుంచి రెండు, బ్రెజిల్, భారత్‌ల నుంచి ఒకటి చొప్పున లభించిన డేటా మదింపు తదుపరి ఈ విషయాలు వెల్లడైనట్లు వివరించింది. కరోనా వైరస్‌ కట్టడికి ఇతర కంపెనీలు అభివృద్ధ చేస్తున్న వ్యాక్సిన్ల బాటలో కోవిషీల్డ్‌ సైతం సత్ఫలితాలు చూపుతున్నట్లు డీసీజీఐకు చేసిన దరఖాస్తులో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు