ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు ఆగిపోతున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి

23 Apr, 2022 10:30 IST|Sakshi

కరోనా విషయంలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతుంటే మరో వైపు వ్యాక్సిన్లు అమ్ముడుపోక ఫార్మా కంపెనీలు లబోదిబోమంటున్నాయి. తమ దగ్గర నిల్వ ఉన్న స్టాకును ఉచితంగా అయినా ఇచ్చేందుకు సై అంటున్నాయి.

కరోనా వ్యాక్సిన్లకు మార్కెట్‌లో డిమాండ్‌ లేనందున తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. పూనేలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఇప్పటికే 20 కోట్ల కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం నిల్వ ఉన్న డోసులు 2021 డిసెంబరులో తయారు చేసినవిగా తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి నుంచి 9 నెలల పాటు వాడుకునే వీలుంది. డిసెంబరు స్టాకే ఇంకా క్లియర్‌ కాకపోవడంతో కొత్తగా తయారీ వృధా అనే అంచనాలతో సీరమ్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎవరైనా అడిగితే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కూడా చెబుతోంది.

గత డిసెంబరులో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసిన తరుణంలో ప్రపంచ దేశాలు అలెర్ట్‌ అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు చేశాయి. కరోనా ఆంక్షలు విధించాయి. అయితే ఒమిక్రాన్‌తో ముప్పు తక్కుగా ఉండటంతో 2022 ఫిబ్రవరి నుంచి క్రమంగా ఆంక్షలు తొలగించాయి. దీంతో సాధారణ జీవితం మొదలైంది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ఏప్రిల్‌ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మళ్లీ మాస్క్‌ తప్పనిసరంటూ ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. 

గతేడాది కరోనా సెకండ్‌ వేవ్‌ ఇండియాలో విలయ తాండవం చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఆ వెంటనే ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతం చేశాయి. వ్యాక్సిన్‌ మిత్ర పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున​ వ్యాక్సిన్లపై నిషేధం విధించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉంటే అన్నింటినీ ఇండియాలోనే ఉపయోగించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం 2021 డిసెంబరులో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూడటంతో మరోసారి బూస్టర్‌ డోసును కూడా అందించారు. ఆ తర్వాత ప్రైవేటు సెక్టారులో కూడా వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

వ్యాక్సిన్లపై ఆంక్షలన్నీ తొలగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో కరోనా వ్యాక్లిన్లకు డిమాండ్‌ లేదు. దీంతో ఒక్కో కంపెనీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే యూఎస్‌కి ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఈ ప్రటకన చేయగా తాజాగా ఇండియన్‌ ఫార్మా కంపెనీ సీరమ్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సైతం ఇదే తరహా నిర్ణయం వెలువరించింది. 

చదవండి👉🏾 జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంచలన నిర్ణయం !

మరిన్ని వార్తలు