భారత్‌ ‘సేవలు’ భేష్‌...

4 Mar, 2023 00:15 IST|Sakshi

ఫిబ్రవరిలో 12 ఏళ్ల గరిష్టం

59.4 వద్ద పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌  

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితీరు ప్రదర్శించింది. దేశ ఎకానమీలో మెజారిటీ వెయిటేజ్‌ ఉన్న ఈ రంగానికి సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 59.4 వద్ద ముగిసింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి.  దేశంలో డిమాండ్‌ పరిస్థితులు, కొత్త వ్యాపారాలు ఊపందుకోవడం వంటి అంశాలు దీనికి కారణమని గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు.

  సూచీ జనవరిలో 57.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన చూస్తే, సేవల రంగం వరుసగా 19 నెలల నుంచి వృద్ధిలోనే కొనసాగుతోంది. కాగా, ఉపాధి అవకాశాల పరిస్థితులు మాత్రం ఇంకా మందగమనంలోనే ఉన్నట్లు డీ లిమా తెలిపారు.  

సేవలు–తయారీ కలిపినా... పురోగతి!
తయారీ, సేవల రంగం కలిపిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా ఫిబ్రవరిలో పటిష్ట స్థాయిలో 59 వద్దకు చేరింది. జనవరిలో సూచీ 57.5 వద్ద ఉంది. ఇది 11 ఏళ్ల గరిష్టం. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం సూచీ ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది.

మరిన్ని వార్తలు