సేవల రంగంలో పెరిగిన ఉపాధి కల్పన

6 Oct, 2021 05:00 IST|Sakshi

10 నెలల్లో మొదటిసారి పురోగతి

ఇండెక్స్‌ మాత్రం 55.2కు డౌన్‌  

న్యూఢిల్లీ: సేవల రంగం 2021 సెప్టెంబర్‌లో (2020 సెప్టెంబర్‌తో పోల్చి) మంచి ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం 10 నెలల తర్వాత ఇదే తొలిసారని ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ సర్వే పేర్కొంది. అయితే సూచీ మాత్రం ఆగస్టులో 56.7 వద్ద (18 నెలల గరిష్టం) ఉంటే, సెప్టెంబర్‌లో 55.2కు తగ్గింది. ఈ ఇండెక్స్‌ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కగడతారు. సెప్టెంబర్‌లో ఇండెక్స్‌ తగ్గినా, దీర్ఘకాలంలో చూస్తే సగటు పటిష్టంగా ఉందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఆమె తెలిపిన అంశాల్లో  ముఖ్యాంశాలు... 

సర్వే ప్రకారం, డిమాండ్‌  బాగుంది.  
డిమాండ్‌ పటిష్ట రికవరీ ధోరణి ప్రయోజనాలను భారత్‌ కంపెనీలు పొందుతున్నాయి.  
రికవరీ ఉన్నా, బిజినెస్‌ విశ్వాసం మాత్రం ఇంకా బలహీనంగానే ఉంది. మూడవవేవ్‌ భయాలతో పాటు ద్రవ్యోల్బణం తీవ్రత అంచనాలూ దీనికి కారణం. సర్వీస్‌ ప్రొవైడర్లలో సానుకూల సెంటిమెంట్‌ తక్కువగా ఉంది.  
భారత్‌ సేవల విషయంలో అంతర్జాతీయ డిమాండ్‌ కూడా బలహీనంగానే ఉంది. ట్రావెల్‌ ఆంక్షలు దీనికి ప్రధాన కారణం.  
తాజా ఎగుమతులకు సంబంధించి వ్యాపార క్రియాశీలత వరుసగా 9వ నెలలోనూ క్షీణించింది.  

సేవలు–తయారీ కలిపినా మందగమనం 
సేవలు, తయారీ రంగం కలిపిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా సెప్టెంబర్‌లో మందమనంలోనే ఉంది. ఆగస్టులో ఈ సూచీ 55.4 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో స్వల్పంగా 55.3కు తగ్గింది. ధరల విషయానికి వస్తే, ఇంధనం, మెటీరియల్, రిటైల్, రవాణా ధరలు పెరగడం ప్రతికూలాంశాలు. భారత్‌ పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఒక్క తయారీ రంగం కార్యకలాపాలు చూస్తే, ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 53.7గా నమోదయ్యింది.

ఆగస్టులో ఇది 52.3 వద్ద ఉంది. కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో విధించిన ఆంక్షలను క్రమంగా సడలించడం తయారీ రంగానికి ఊతం ఇస్తోంది. అయితే  ముడి పదార్ధాల ధరలు ఐదు నెలల గరిష్టానికి చేరాయి. పెరిగిన ఇంధన, రవాణా ధరలు దీనికి కారణం. ముడి పదార్థాల ధరలు పెరిగినప్పటికీ, ఉత్పత్తి ధరల పెరుగుదల్లో మాత్రం అంత వేగం లేకపోవడం గమనార్హం. వృద్ధికి ఊతం అందించే క్రమంలో అక్టోబర్‌ 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య జరిగే ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాల సందర్భంగా ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు అంచనావేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు