మూడో నెలా ‘సేవలు’ పేలవం!

5 Aug, 2021 01:29 IST|Sakshi

జూలైలోనూ క్షీణతలో పీఎంఐ

సూచీ 45.4గా నమోదు

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో సేవల రంగం వరుసగా మూడవనెల జూలైలోనూ క్షీణతలోనే ఉంది. ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ జూలైలో 45.4గా నమోదయ్యింది. జూన్‌లో ఇది 41.2 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటేనే దానిని వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. సేవల రంగంలో వ్యాపార క్రియాశీలత, కొత్త ఆర్డర్లు, ఉపాధి కల్పన మరింత భారీగా పడిపోయినట్లు నెలవారీ సర్వే వెల్లడించినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. 

రాబోయే ఏడాది ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమలు నిరాశాజనకంగా ఉండడం మరో అంశం. ఈ తరహా నిరాశావాద ధోరణి ఏడాదిలో ఇదే తొలిసారి. మహమ్మారి కనుమరుగవడంపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు జూలైలో వ్యాపార విశ్వాసాన్ని దెబ్బతీసినట్లు డీ లిమా పేర్కొన్నారు. ఈ రంగంలో వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ ఉపాధి అవకాశాలు క్షీణతలోనే ఉన్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా సేవల రంగానిదే.

సేవలు, తయారీ కలిపినా మైనస్సే...
మరోవైపు సేవలు, తయారీ కలిపిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ వరుసగా మూడవనెలా క్షీణతలోనే కొనసాగింది. జూన్‌లో 43.1 వద్ద ఇండెక్స్‌ ఉంటే, జూలైలో 49.2 వద్దకు చేరింది. ఇండెక్స్‌ కొంత పెరగడమే ఇక్కడ ఊరట. 50కి పైన సూచీ వస్తేనే కాంపోజిట్‌ ఇండెక్స్‌ వృద్ధిలోకి మారినట్లు భావించాల్సి ఉంటుంది. ముడి పదార్థాల ధరల తీవ్రత సూచీలపై పడుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది. జూలైలో ఒక్క తయారీ రంగం మాత్రం క్షీణత నుంచి బయటపడ్డం కొంతలో కొంత ఊరటనిస్తున్న అంశం.

జూన్‌లో 48.1 వద్ద క్షీణతలో ఉన్న ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) జూలైలో 55.3 వృద్ధిలోకి మారింది.   వరుసగా 36 నెలలు 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ పీఎంఐ, కరోనా కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి 2020 ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చి, అదే జోరును కొనసాగించింది.  అయితే సెకండ్‌వేవ్‌ ప్రభావంతో జూన్‌లో తిరిగి క్షీణతలోకి జారింది.

మరిన్ని వార్తలు